స్పెషల్ డెస్క్- వివాహం.. మూడు ముళ్లు, ఏడడుగులు, వందేళ్ల బంధం. ఒకప్పుడు వరుడు, వధువు అస్సలు చూసుకునే వాళ్లు కాదు. పెద్దలు పెళ్లి నిశ్చయిస్తే తలొంచుకుని పెళ్లి కూతురు తాళి కట్టించుకునేది. పెళ్లి కొడుకు అమ్మాయిని చూడకుండానే తాళి కట్టేవాడు. మారుతున్న కాలానుగునంగా పెళ్లి చూపులు జరిగేవి. ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చితే పెళ్లి చేసే వారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ కాలం. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే నెపంతో డేటింగ్ చేస్తున్నారు. ఈ కాలంలో అమ్మాయిలు అన్ని విధాలుగా అబ్బాయి నచ్చితేనే పెళ్లికి సై అంటున్నారు.
పెళ్లి కొడుకు ఏ మాత్రం నచ్చకపోయినా పెళ్లి పీఠల వరకు వచ్చినా నో చెప్పేస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాగే ఓ పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగడానికి కారణం చిన్నదే అయినా అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంది. యూపీలోని ఔరయ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో వరుడు నల్ల అద్దాలు ధరించి ఉండటాన్ని చూసిన వధువుకు అనుమానం వచ్చింది. దీంతో వారు వరుణ్ణి నల్ల కళ్లద్దాలు తీసి, వార్తాపత్రిక చదవమని టెస్టు పెట్టారు. అయితే అతను చదవలేకపోయాడు. దీంతో వరునికి దృష్టిలోపం ఉందని తేలింది. ఈ విషయం తెలుసుకున్న వధువు అటువంటి వరుడు తనకు ససేమీరా వద్దని తేల్చిచెప్పేసింది.
మహారాజ్‌పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమార్‌తో తన కుమార్తె వివాహం చేయాలని నిశ్చయిచారు. ఐతే వివాహ వేడుకలో భాగంగా నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న పెళ్లి కొడుకుపై వధువు తరపువారికి అనుమానం వచ్చింది. ఈ విషయమైవారు వరుని తరపువారిని ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో, వరుడి చేతికి ఒక న్యూస్ పేపర్ ఇచ్చి దానిని చదవమన్నారు. ఐతే పెళ్లి కొడుకు పేపర్ చదవలేకపోయాడు. ఇంకేముంది వధువు తరపు బంధువులంతా అతనితో పాటు, అతని ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య పంచాయితీ జరిగింది. ఈ విషయమంతా తెలిసిన వధువు తనకు ఈ పెళ్లి వద్దని చెప్పేసింది. వధువు తండ్రి వరుడి కుటుంబ సభ్యులు చేసిన మోసంపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు.