హైదరాబాద్- ఈ మధ్య సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లై పిల్లులున్న వారు కూడా వ్యామోహంలో పడి చెడు దారి పడుతున్నారు. దీంతో చాలా కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. అంతే కాదు పచ్చని సంసారం చిచ్చు రేగి, హత్యలు, ఆత్మహత్యల వరకు దారితీస్తున్నాయి.
ఐతే సాధారనంగా మగాళ్లు భార్య ఉండగానే, మరో మహిళతో సంబందం పెట్టుకోవడం పరిపాటి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఒక భార్య కోసం ఇద్దరు భర్తలు వీధి పోరాటానికి దిగారు. ఆమె నా భార్య అంటే.. కాదు ఆమె నా భార్య అంటూ ఇద్దరూ మగాళ్లు ఓ మహిళ కోసం వీధికెక్కారు. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని ఒకరు కేసుపెడితే, తన భార్య కనిపించడం లేదంటూ మరో భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలో జరిగింది.
హన్మకొండలోని టీచర్స్ కాలనీకి చెందిన 42 ఏళ్ల శ్రీనివాస్ స్థానికంగా ఓ గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకి 22 ఏళ్ల కిందట ఖాజీపేటకి చెందిన 35 ఏళ్ల సునీతతో పెళ్లైంది. ప్రస్తుతం వారికి టీనేజ్ వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత సంవత్సరం ఆగస్టులో పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన సునీత మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఆమె వెళ్లేటప్పుడు ఇంట్లోని బంగారం, డబ్బు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో సునీత ఆచూకీ కోసం భర్త, బంధువులు ఎంత వెతికినా దొరకలేదు.
ఇక చేసేది లేక ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంకి చెందిన శేఖర్ తో తన భార్య వెళ్లిపోయిందని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు భర్త. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సునీత ప్రియుడు శేఖర్‌తో కలసి బల్కంపేటలోని ప్రశాంత్ కాలనీలో సహజీవనం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. మొదటి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సునీత, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిందామె.
అసలు శ్రీనివాస్ తన భర్తే కాదని, తన అక్క భర్తని ప్లేటు ఫిరాయించింది. ఆ పిల్లలు కూడా తన బావ పిల్లలేనని కొత్త డ్రామాకు తెరలేపింది. ఐతే సునీత ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమ స్టైల్లో విచారణ జరపడంతో శ్రీనివాస్ ఆమె మొదటి భర్తేనని తేలింది. ఇంకేముంది సునీత, శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా సునీత తన ప్రియుడు శేఖర్‌తో కలసి బల్కంపేటలో నివాసముంటోంది. దీంతో ఆమె నా భర్య అంటే, నా భర్య అని ఇద్దరు భర్తలు గొడవ పడుతున్నారు. మరోసారి ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.