భద్రాద్రి కొత్తగూడెం– పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆ తరువాత గ్యాస్ లీక్ చేసి మంటలు అంటించుకుని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ విషాదకర ఘటనలో మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి సుమారు 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
రామకృష్ణ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకే, ఓ పథకం ప్రకారమే ఆత్మహత్యకు చేసుకున్నట్లు సమాచారం. రాజమండ్రి నుంచి కుటుంబంతో సహా వచ్చిన రామకృష్ణ రాత్రి భోజనం చేసిన తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసి గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు మంటలకు భయపడి బయటకు పరిగెత్తడంతో గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతని కారులో సూసైడ్ నోట్ తో పాటు కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్లు సమాచారం. సూసైడ్ నోట్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కొడుకు వనమా రాఘవేంద్ర పేరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ లో తన ఫ్యామిలీ ఆత్మహత్యకు ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేంద్ర, తన తల్లి సూర్యవతి, అక్క లోవమాధవి కారణమని పేర్కొన్నాడు.
రామకృష్ణ సూసైడ్ నోట్ లో ఏంరాసాడంటే.. నా కుటుంబ చావుకి కారణం వనమా రాఘవేందర్, మండిగ సూర్యవతి, కొమ్మశెట్టి లోవమాధవి. మా అక్కకి వనమా రాఘవతో ఉన్న అక్రమ సంబంధం కారణంగా నాకు అన్యాయం జరిగినందుకు నేను ఈ నిర్ణం తీసుకొన్నాను.. అని సూసైడ్ నోట్ లో ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. గతంలోనూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాననంటూ ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.