హైదరాబాద్- ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్ది యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, నిద్ర మత్తు వంటి కారణాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చాలా ప్రాంతాల్లో కార్లు కాలువల్లోకి, చెరువుల్లోకి దూసుకెళ్లడం చూస్తున్నాం. హైదరాబాద్ లోను ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది.
హైదరాబాద్ లో నడి బొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, కార్తీక్, స్పత్రిక్ అనే ముగ్గురు యువకులు అఫ్జల్ గంజ్ కు వెళ్లడానికి కారులో బయలుదేరారు.
ఎన్టీఆర్ మార్గ్ ద్వారా అతి వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టి హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుస్సేన్ సాగర్ లేక్ పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో కారుతో సహా ముగ్గురు యువకులను బయటకు తీశారు.
వీరిలో ఒకరికి చేయి ఫ్రాక్చర్ అవ్వగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు చెప్పారు. వారందరిని చికిత్స నిమిత్తం సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారిపై కేేసు నమోదు చేసినట్లు హుస్సేన్ సాగర్ లేక్ పోలీసులు చెప్పారు.