సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రోజూ లక్షల మందికి వ్యాపిస్తూ వేల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకొంటున్న ఈ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో కరోనా దేవి ఆలయం నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించాలని వేడుకుంటూ 48 రోజుల పాటు రోజూ పూజలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
కోయంబత్తూరు శివారులోని ఇరుగుర్‌లో కామట్చిపురి అధినం ఆధ్వర్యంలో ఈ గుడిని ఏర్పాటు చేశారు. కరోనా దేవికి 1.5 అడుగుల నల్లరాతి విగ్రహం చేయించారు. దీన్ని ఆ మఠం పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు. కరోనా దేవికి నిష్టగా 48 రోజుల పాటు ప్రార్ధనలు చేస్తే ఈ తల్లి కరుణించి వెళ్ళిపోతుందని ఆశిస్తున్నట్టు నిర్వాహకులు అంటున్నారు. విపత్కర సమయాల్లో ఇక్కడ ఆలయాలు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ప్లేగు వ్యాధి వచ్చి అనేకమందిని పొట్టన పెట్టుకున్నప్పుడు కూడా జిల్లాలో మరియమ్మన్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి రోజూ పూజలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ స్థలం ప్లేగు మరియమ్మన్ ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కరోనా దేవి ఆలయంలోకి పూజారులు, మఠం అధికారులను మాత్రమే అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఏదేమైనా కరోనా మహమ్మారిని పారద్రోలాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అందులో ఇదీ ఒకటి. ఏది ఫలించినా మంచిదే కదా!