దేశంలోని ప్రజలపై న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దోషులుగా నిర్ధారణై.. వారికి శిక్షలు పడే సమయానికి బాధితులకు నిజమైన న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది.
దేశంలోని ప్రజలకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దోషులుగా నిర్ధారణై.. వారికి శిక్షలు పడే సమయానికి బాధితులకు నిజమైన న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది. ఫాస్ట్ ట్రాకులున్నా రోజు రోజుకు పెరుగుతున్న కేసులు న్యాయ వ్యవస్థలో కుప్పలుతెప్పులుగా పడి ఉన్నాయి. ఆ కేసులన్నీ పరిష్కరించేందుకు అనే సంవత్సరాలు పట్టేస్తున్నాయి. అయితే ఇటీవల కొన్ని కేసుల్లో తీర్పులు చూస్తుంటే వింతగా అనిపించినా.. ఒకింత ఆనందం ఏర్పడుతుంది. ఎందుకంటే బాధితులకు అమలు చేస్తున్న శిక్షలు అలా ఉన్నాయి మరీ. ఓ బస్సు వేలంలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసు నిందితుడికి 32 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడితే.. ఆ విధించిన సంవత్సరాలు చెబితే నోరెళ్ల బెట్టాల్సిందే.
ఇంతకు ఆ నిందితుడికి వేసిన శిక్షా కాలం ఎంతో తెలుసా అక్షరాలా 383 సంవత్సరాలు. అవును మీరు వింటున్నదీ నిజమే. ఇంతకు ఏం జరిగిందంటే.. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కోయంబత్తూర్ డివిజన్ బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు నమోదైంది. అక్రమ పత్రాలు సృష్టించి 1986 నుండి 88 వరకు 47 బస్సులను విక్రయించేశారు. రూ. 28 లక్షల మోసానికి పాల్పడ్డారు. ఆడిట్ నిర్వహించిన సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది మందిపై ఫిర్యాదు అందగా..సిబి-సీఐడి 1990లో కేసు నమోదు చేసింది. చేరన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దొరైసామి, రంగనాథన్, రాజేంద్రన్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి స్థానిక కోర్టులో విచారణ జరుగుతోంది.
విచారణ జరుగుతుండగానే రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతిచెందారు. తాజాగా విచారణ చేపట్టిన కోయంబత్తూర్ ఫస్ట్ అడిషనల్ సబార్డినేట్ జడ్జి శివకుమార్.. తీర్పును వెల్లడించారు. కోదండపాణి మినహా మిగిలిన ముగ్గుర్ని నిర్థోషులుగా పేర్కొన్నారు. ఈ కేసులో కోదండపాణిని మూడు సెక్షన్ల కింద దోషిగా తేల్చిన కోర్టు.. 47 నేరాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ఫోర్జరీ మోసాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను దొంగిలించినందుకు ఏడు సంవత్సరాలు జైలు విధించింది. అంతే మొత్తంగా 383 సంవత్సరాల జైలు శిక్షను కోదండపాణికి విధించింది. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షలను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. దీనితో పాటు రూ. 3.32 కోట్ల జరిమాను విధించింది. ఈ మొత్తాన్ని కోయంబత్తూర్ రాష్ట్ర రవాణా సంస్థకు అందించాలని తెలిపింది. ఫైన్ చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.