శ్రీశైలం- గత కొన్ని రోజులుగా దేశంలో డ్రోన్లు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉగ్ర కార్యకలాపాల నేపధ్యంలో డ్రోన్ల కదలికలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. దీంతో అపరిచిత డ్రోన్లు ఎక్కడ కనిపించినా పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. ఇదిగో తాజాగా ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఓ డ్రోన్ కలకలం రేపింది.
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో ఓ డ్రోన్ అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని స్థానికులు గమనించారు. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణి దగ్గర ఈ డ్రోన్ ను భక్తులు గుర్తించారు. వెంటనే ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో గాలించగా ఇద్దరు అనుమానిత వ్యక్తులు కనిపించారు.
వారిద్దరు గుజరాత్ రిజిస్ట్రేషన్ కారులో డ్రోన్ తో కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ గురించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, ఇద్దర్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎందుకు పంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారికి ఇంకా ఎవరైనా సహకరించారా అన్న క్రమంలో కూడా ఆరా తీస్తున్నారు.
ఈ సంవత్సరం జులైలో కూడా శ్రీశైలం సమీపంలో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అర్ధరాత్రి వేళ డ్రోన్లు తిరగడం అనుమానాలు అప్పట్లో కలకలం రేపింది. డ్రోన్లు తిరుగుతున్న సమయంలో పట్టుకునేందుకు దేవస్థానం, భద్రతా సిబ్బంది ప్రయత్నించినా అవి మాత్రం దొరకలేదు. జిల్లా ఎస్పీ రంగంలోతి దిగి అక్కడ స్పెషల్ టీమ్‌లతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆరు నెలల తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్లీ డ్రోన్ కనిపించడంతో పలు అనుమానాలకు వావిస్తోంది.