తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రాధాన్యతనిస్తాం. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రుల దగ్గర గారాబం వల్ల నేర్చుకోలేని చిన్న చిన్న పనులు, మన కాళ్లపై మనమే నిలబడాలన్న పాఠాలు గురువుల దగ్గరి నుండే నేర్చుకుంటాం. జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొవాలో, విజయం ఎలా సాధించాలో నేర్పేదీ కూడా గురువే. అలాంటి గురువుపై దాడి చేశాడో విద్యార్థి.
గురువు దైవంతో సమానం. మనం పాఠాలనే కాదు జీవిత గుణ పాఠాలను వీరి దగ్గర నుండే నేర్చుకుంటాం. మన తప్పుల్ని సరి చేస్తూ మనల్ని మంచి దారిలో పెట్టేది, నడిపించేది గురువే. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే గురువు కనీసం వారి నుండి ఏమీ ఆశించడు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆ ఎదుగుదలకు కారణమైన మన ఉపాధ్యాయుల్ని మనం గుర్తు పెట్టుకోవాలి. గతంలో పిల్లల చదువు నిమిత్తం గురువులు చేసే దండన కూడా తియ్యగా ఉండేది. కానీ నేటి తల్లిదండ్రుల్లో మారుతున్న తీరు, సమాజంలో ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా చదువు కేవలం తరగతి గదులకే పరిమితమైంది. కొట్టడం సంగతి అటు పెడితే.. కోప్పడినా కూడా వారిపై పోట్లాటకు వెళ్లిపోతున్నారు తల్లిదండ్రులు. కరోనాతో సెల్ ఫోన్లో చదువులు వచ్చాక.. గురువులకు, విద్యార్థులకు మధ్య బాండింగ్ మరింత తగ్గిపోయింది. చివరికీ గురువును అగౌరపరిచే స్థాయికి విద్యార్థులు చేరుకుంటున్నారు.
అటువంటి అవమానమే ఓ ఉపాధ్యాయురాలు ఎదుర్కొంది. పాఠాలు వినకుండా వీడియో గేమ్ లో ఆడుకుంటున్నాడని గ్రహించిన ఓ టీచరమ్మ.. దాన్ని తీసుకుని బయటకు వెళ్లిపోయింది. అంతే.. పట్టరాని కోపంతో ఉన్న విద్యార్థి.. ఆమెపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఫిబ్రవరి 21న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పామ్ కోస్ట్ లో ఉన్న మటంజాస్ హై స్కూల్ లో చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి.. అదే స్కూల్లో సహోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నమహిళపై దాడి చేశాడు. ఫ్లాగ్లర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఈ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారిపోయింది. దీనిపై పలువురు మండిపడుతున్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే..
క్లాసులో వీడియో గేమ్ ఆడుతున్నాడని గ్రహించిన ఉపాధ్యాయురాలు.. అతడి వద్ద నుండి దాన్ని తీసుకుని బయటకు వచ్చింది. ఈ చర్యతో ఆమెపై పీకల వరకు కోపం తెచ్చుకున్న17 ఏళ్ల విద్యార్థి వెనుక నుండి వచ్చి ఆమెను గట్టిగా తోసేశాడు. ఆ ఫోర్సుకు ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రంగా దెబ్బతగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా ఆమెను విద్యార్థి వదిలిపెట్టలేదు. పిడిగుద్దులు కురిపించాడు. ఒకరిద్దరూ ఆపేందుకు ప్రయత్నించినా..ఆమెను విచక్షణా రహితంగా కొడుతూనే ఉన్నాడు. చివరకు నలుగురు అడ్డుకోగా.. తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. టీచర్ ను ఓ విద్యార్థి కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీచర్ పై జరిగిన ఈ దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) February 28, 2023