హైదరాబాద్ క్రైం- ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సైదాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన రాజు, అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆపై గొంతు నులిమి హత్యచేశాడు. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారిపై కన్నేసిన ఈ కామాంధుడు, మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఆపై అత్యంత అమానుషంగా హత్య చేశాడు. రాజు కోసం తెలంగాణ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన రాజు చరిత్ర ఒక్కసారి పరిశీలిస్తే.. రాజు కుటుంబం స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం. 30 ఏళ్ల క్రితం రాజు పుట్టక ముందే బతుకు దెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చారు. హైదరాబాద్ వచ్చాకే రాజు పుట్టాడు. ఐతే రాజు, గాని అతని తల్లి దండ్రులు గానీ ఇంతవరకు కొడకండ్లకు వెళ్లలేదు. కొడకండ్లలో ఇప్పటికీ రాజు బాబాయ్ కుటుంబం నివాసం ఉంటోంది. కానీ ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు లేవు.
నిందితుడు రాజు తండ్రి చాలా రోజుల నుంచి కనిపించడం లేదు. అతను పారిపోయాడా, లేక చనిపోయాడా అన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. రాజు ప్రవర్తన వల్లే తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోయాడని అంతా అనుకుంటున్నారు. రాజు కు ఓ అక్క ఉంది. హైదరాబాద్ లో నివాసం వున్నప్పుడే యాదాద్రి జిల్లా అడ్డగుడూరుకి చెందిన ఓ అబ్బాయితో ఆమెకు పెళ్లైంది. అక్కను చూసేందుకు అప్పుడప్పుడు రాజు వెళ్తుండేవాడు. ఇటీవల కాలంలో అక్కతో కూడా రాజుకు సరిగ్గా మాటలు లేవని స్థానికులు చెబుతున్నారు.
ఇక రాజు ఎప్పుడు ఏదో మైకంలో ఉండేవాడట. మద్యం లేనిది రాజు క్షణం ఉండేవాడు కాదట. మధ్యంతో పాటు గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సైతం రాజు సేవించేవాడని స్థానికులు చెబుతున్నారు. రాజు మత్తులో ఉన్నప్పుడు ఆడవాళ్లను అదోరకంగా చూసేవాడని, కానీ ఆరేళ్ల చిన్నారిపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడని ఉహించలేదని స్థానికులు అంటున్నారు. అన్నట్లు రాజు నల్గొండ జిల్లాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.