జాతీయ రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ రాజకీయ నాడి కేంద్రమైన ఖమ్మంలో భారీగా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అయితే ఈ సభ విజయవంతమయ్యే బాధ్యతలను ఆ పార్టీ నేతలకు అప్పగించింది. దీంతో ఈ సభకు భారీగా ప్రజలను తరలించేందుకు ఆ పార్టీ మంత్రులు, నేతలు కుస్తీలు పడుతున్నారు.
టార్గెట్ ప్రకారం ప్రజలను సభకు తరలించినట్లయితే సర్పంచ్ లకు.. తన పంచాయతీ రాజ్ శాఖ నుండి రూ. 10 లక్షల చొప్పున ఫండ్స్ ఇప్పిస్తానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు . మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండల కేంద్రంలో ఖమ్మం సభ కోసం ఏర్పడిన కమిటీలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు చిన్న పంచాయతీల నుండి కనీసం 300 మందిని, పెద్ద పంచాయతీల నుండి 600 మందిని తరలించాలని సర్పంచులకు హుకుం జారీ చేశారు. తాను ఇచ్చిన టార్గెట్ చేయని సర్పంచులకు నిధులు కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున కేటాయిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఈ సభకు తాను చెప్పినట్లు జనసమీకరణ చేస్తే తన శాఖ నుండి రూ. 10 లక్షల చొప్పున ఫండ్స్ ఇస్తానని తెలిపారు. చేయని వారు నిధులు కేటాయించనన్నారు. కెసిఆర్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంచారని, భారత్ లో ప్రజా, రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే కెసిఆర్ లక్ష్యమని అన్నారు. . కాగా, సోమవారం కూడా నర్సింహుల పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో.. బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వారిని మారిస్తే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు పైగా సీట్లు రావడం ఖాయమని చెప్పి కలకలం రేపారు.