బెంగళురు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియిలు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహంపై కాసేపు జాతీయ జెండాను కప్పి ఉంచి, అనంతరం ఆ పతాకాన్ని పునీత్ భార్యకు అందజేశారు. కంఠీరవ స్టూడియోస్ లోని తండ్రి రాజ్ కుమార్ సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ కూడా సమాధి అయ్యారు.
అంతకు ముందు కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టుడియోస్ వరకు జరిగిన పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్రలో కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు యడ్యూరప్ప, సిద్దరామయ్యలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. లక్షలాది మంది అభిమానులు, ప్రజలు పునీత్ కు కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు వందిత, ధృతి, సోదరుడు శివరాజ్ కుమార్ రోదనలు పలువురి చేత కంటతడి పెట్టించాయి.
పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండె పోటుతో మరణించడంతో కర్ణాటక రాష్ట్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇంట్లో ఉదయం జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన పునీత్ ను ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పునీత్ మరణవార్త దక్షిణ భారత సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునీత్ అంతిమ దర్శనానికి తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
శనివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించి శ్రద్థాంజలి ఘటించారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, రానా తదితరులు పునీత్ పార్ధివదేహానికి నివాళులర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పెద్ద కూతురు అమెరికా నుంచి వచ్చేందుకు ఆలస్యం కావడం వల్ల ఈ రోజు తెల్లవారు జామున అశ్రు నయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
#WATCH | Mortal remains of Kannada actor Puneeth Rajkumar being carried to Sree Kanteerava Studios in Bengaluru, where his last rites will be performed today pic.twitter.com/xHyBYL6Rxt
— ANI (@ANI) October 31, 2021