ఒక్కోసారి ఒక్క అవమానం ఖరీదు కోట్లు ఉంటుంది. అవమానాన్ని తలచుకుని ఆగిపోయే కంటే అవమానించిన వారే తలదించుకునేలా ఎదగాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఈమె సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించి నిలబడేవాళ్ళే సక్సెస్ అవుతారు. అలా నిలబడిన వారిలో సీఏ దివ్య రాఘవేంద్రరావు ఒకరు. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు చెప్పడంతో సీఏ చేశారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఫుడ్ బిజినెస్ చేయాలన్న ఆలోచన వచ్చింది. మెక్ డొనాల్డ్స్, కేఎఫ్సీ, స్టార్ బక్స్ వంటివి ఎలా సక్సెస్ అయ్యాయో అనే వివరాలు ఈ కోర్సులో వివరించబడ్డాయి. అయితే మెక్ డొనాల్డ్స్, కేఎఫ్సీ లాంటి ఫుడ్ బిజినెస్ లని ప్రపంచవ్యాప్తంగా నడపడం భారతీయులకు సాధ్యం కాదని ఓ ప్రొఫెసర్ దివ్యతో అన్నారు. అదే ఆమెను ఫుడ్ బిజినెస్ లో రాణించేలా ప్రేరేపించింది.
ప్రొఫెసర్ చెప్పింది కూడా నిజమే.. దేశంలో వరల్డ్ క్లాస్ ఫుడ్ చెయిన్ లేదని ఆమె ఆలోచనలో పడ్డారు. సాంప్రదాయ దక్షిణ భారతదేశ ఆహారాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అయితే రెస్టారెంట్ ప్లాన్స్ గురించి రాఘవ్ ని కలిసే వరకూ ఆలోచించలేదు. ఆహార రంగంలో రాఘవ్ కి 15 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉంది. బెంగళూరులోని శేషాద్రిపురం రోడ్డు పక్కన చిన్న బండి మీద ఫుడ్ బిజినెస్ చేసేవారు. అయితే రాఘవ్ కి కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు లేదు. చాలా రెస్టారెంట్లలో పని చేశారు. క్యాషియర్ గా, క్లీనర్ గా, కౌంటర్ బాయ్ గా పని చేశారు. కూరగాయలు కోయడం నుంచి అన్ని పనులూ వచ్చు. ఫ్రెండ్స్ తో కలిసి చిన్న రెస్టారెంట్ మొదలుపెడితే నష్టాలూ వచ్చాయి.
అయితే రాఘవ్ ని సీఏగా కలిసి వ్యాపారాన్ని ఆర్థికంగా ఎలా మేనేజ్ చేయాలో సలహా ఇచ్చారు దివ్య. ఆ తర్వాత రాఘవ్ తాను రెస్టారెంట్ చెయిన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నానని దివ్యకు చెప్పారు. అప్పటికే దివ్య సీఏగా బాగా స్థిరబడ్డారు. కెరీర్ కూడా బాగుంది. కానీ రిస్క్ చేద్దామని ఆమె నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె తన ఇంట్లో చెప్తే.. నిన్ను ఎంతో కష్టపడి సీఏ చేస్తే రోడ్ల పక్కన 10 రూపాయలకి, 20 రూపాయలకి ఇడ్లీ, దోస అమ్ముకుంటావా అని అన్నారు. ఆమె తల్లి అలా అనడంలో తప్పు లేదు. ఎందుకంటే వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. అయితే డబ్బు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో.. తన కుటుంబం యొక్క వారాంతపు ఖర్చులు అన్నీ తెలుసునని.. ఒక సింగిల్ ఎగ్ పఫ్ తినడం కోసం వారం మొత్తం ఎదురుచూసేవారని ఆమె అన్నారు.
ఆస్తులు లేవు. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవడానికి అవసరమైన డబ్బు సంపాదించడానికే ఆమె ఇంత కష్టపడి చదువుకుంది. సీఏ చదవడానికి చాలా కష్టపడింది. ట్యూషన్ కోసం 2, 3 బస్సులు మారేది. మొత్తానికి ఎలాగోలా సీఏ అయ్యారు. ఆమె కుటుంబంలో ఆమెనే మొదటి సీఏ. అమ్మ, నాన్నలని బాగా చూసుకోవాలన్న లక్ష్యం ఉన్నా కూడా ఆమె తన కెరీర్ ని రిస్క్ లో పెట్టి మరీ ఫుడ్ బిజినెస్ లో దిగారు. రాఘవ్ తో కలిసి దాచుకున్న డబ్బులతో రామేశ్వరం కేఫ్ ని ప్రారంభించారు. ఈ పేరునే ఎంచుకోవడానికి కారణం.. మాజీ ఇండియన్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరంలో పుట్టడమే. ఆయనకే ఆ రెస్టారెంట్ ని అంకితం చేశారు.
అయితే దక్షిణ భారతీయ ఫుడ్ బిజినెస్ లకి బెంగళూరులో కొరత లేదు. అయినప్పటికీ అందరి కంటే భిన్నంగా రాఘవ్, దివ్య అనుకున్నారు. రామేశ్వరం కేఫ్ లో టిఫిన్లు, చట్నీ అన్నీ తాజాగా ఉండాలనేది వారి మొదటి అంశం. అందుకోసం వారు అసలు ఫ్రిడ్జ్ లని కేఫ్ లో పెట్టలేదు. అత్యంత నాణ్యమైన ముడిసరుకులను వాడేవారు. అదే రామేశ్వరం కేఫ్ ని బెంగళూరులో ప్రత్యేకంగా నిలబెట్టింది. అలా మొదటి అవుట్ లెట్ సక్సెస్ అయ్యింది. మంచి పేరు వచ్చింది. తర్వాత మరొక అవుట్ లెట్ తెరిచారు. అదే సమయంలో రాఘవ్ దివ్యకి ప్రపోజ్ చేశారు. ఆల్రెడీ మనం బిజినెస్ పార్టనర్స్ గా ఉన్నాం.. లైఫ్ పార్టనర్స్ ఎందుకు కాకూడదు అని అడగడంతో.. ఆమె ఒక చిన్న స్మైల్ తో ప్రేమను అంగీకరించారు.
అలా ఈ ఇద్దరూ కలిసి రామేశ్వరం కేఫ్ ని ఇండియాలోనే బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్ చెయిన్ గా తీసుకెళ్లారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించి మొత్తం నాలుగు అవుట్ లెట్లు ఉన్నాయి. త్వరలో దుబాయ్ లో ఒక అవుట్ లెట్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ లో కూడా ఒక కేఫ్ ని ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఈ అవుట్ లెట్స్ లో మొత్తం 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే తమ రామేశ్వరం కేఫ్ ఆశయాలు చాలా పెద్దవని.. రాబోయే ఐదేళ్ళలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంతో పాటు విదేశాల్లో ఉనికిని కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. అయితే ఈ రామేశ్వర కేఫ్ ద్వారా నెలకు 4.5 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. దీని గురించి ఆమెను అడిగితే కాదనలేదు, ఆలా అని అవుననలేదు. కానీ ఆమె నవ్వుతూ మంచి వ్యాపారం చేస్తున్నానని అన్నారు.
రాఘవ్ కి బిజినెస్ ఎలా చేయాలో రాదు, కానీ ఫుడ్ రంగంలో ఫుల్ కమాండ్ ఉంది. ఇటు దివ్యకి ఫుడ్ చెయిన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉన్నా ఎలా చేయాలో తెలియదు. కానీ సీఏ చేశారు కాబట్టి ఎలా మేనేజ్ చేయాలో, ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలుసు. అలా విధి ఈ ఇద్దరినీ ఒకటి చేసి సక్సెస్ ఫుల్ బిజినెస్ పార్టనర్స్ గా చేసి.. ఆపై ఒక ఇంటి వారిని చేసింది. మరి సీఏ చదివి.. రోడ్డు పక్కన ఇడ్లీ, దోస అమ్ముకుంటావా అని అన్న అమ్మ ఊహించని స్థాయిలో రెస్టారెంట్ బిజినెస్ లో సక్సెస్ అయ్యి.. కేఎఫ్సీ, మెక్ డొనాల్డ్స్ లాంటి ఫుడ్ చెయిన్ లు భారతీయులు చేయలేరు అన్న ప్రొఫెసర్ మాటలను అబద్ధం చేస్తూ ఇవాళ విదేశాల్లో మన భారతీయ వంటలను పరిచయం చేస్తున్న దివ్య రాఘవేంద్రరావుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.