కోల్ కత్తా- పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీ పూర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత ప్రతిపక్ష నాయుకుడు సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోయింది.
కేవలం1959 ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో మమతా బెనర్జీ కోర్టులో ఫలితాన్ని సవాలు చేశారు. ఇప్పుడా కేసు కోర్టులో ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మమతా బెనర్జీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కానీ ఆరు నెలల లోపు ఆమె ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అందుకే భవానీపూర్ నియోకజవర్గం నుంచి టీఎంసీ తరపున గెలుపొందిన అభ్యర్థి శోభందేబ్ చటోపాధ్యాయ్ రాజీనామా చేశారు.
ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30 న భవానీపూర్ కు ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోంది. ఈమేరకు మమతా బెనర్జీపై ఎవరిని బీజేపీ పార్టీ పోటీకి దింపుతుందా అని ఉత్కంఠ నెలకొంది. ఆ సస్పెన్స్ కు తెరదించుతూ బీజేపీ అభ్యర్ధిగా ప్రియాంక తిబ్రేవాల్ ను ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన హింస కేసులో పోరాడుతున్న అడ్వకేట్ ప్రియాంక తిబ్రేవాల్ బీజేపీ వ్యూహాత్మకంగా మమతాబెనర్జీపై పోటీకి దింపింది.
కేవలం 41 ఏళ్ల వయస్సు ఉన్న ప్రియాంక తిబ్రేవాల్ కోల్ కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా మంచి పేరు సంపాదించుకుంది. ప్రియాంక తిబ్రేవాల్ 2014 లో బీజేపీలో చేరింది. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపుపై మమతతో పాటు బీజేపీ సైతం ధీమా వ్యక్తం చేస్తోంది.