న్యూ ఢిల్లీ- ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరన్న విషయం తెలిసిందే. నిమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల, చికిత్స తీసుకుంటూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించిందని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసిన ప్రధాని, సిరివెన్నెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
ట్విట్టర్ లో ప్రధాని మోదీ ఏమన్నారంటే.. ‘‘అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది.. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది.. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు.. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.. ఓం శాంతి..’’ మోదీ పేర్కొన్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ రంగానికి చేసిన సేవలను అంతా కొనియాడుతున్నారు. ఆయన పాటలు సమాజాన్ని మేల్కొలిపేలా, ఉత్తేజపరిచేలా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా, తెలుగు వారంతా సాహిత్య జ్ఞానిని కోల్పేయిందని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.
అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU
— Narendra Modi (@narendramodi) November 30, 2021