ఇంటర్నేషనల్ డెస్క్– ఈ మధ్యకాలంలో కొంత మందికి చావు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. తాము చేసే వెధవ పనులకు అందుబాటులో ఉన్న అవకాశాలును ఎలా ఉపయోగించుకోవాలో వారికి బాగా తెలుసు. ఇదిగో కొంత మంది విదేశాలకు అక్రమంగా ప్రవేశించేందుకు ఏకంగా విమానాన్నే ఉపయోగించుకుని ఔరా అనిపించారు. ధర్జాగా విమానం ఎక్కి, తమకు కావాల్సిన చోటు విమానాన్ని ఆపి మరీ చెక్కేశారు.
ఈ కొత్త రకం అక్రమ వలస శుక్రవారం స్పెయిన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఎయిర్ అరేబియా విమానం మొరాకోలోని కాసాబ్లాంకా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇందులో చాలా మంది మొరాకో దేశస్తులున్నారు. మార్గ మధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ కింద పడి విలవిలలాడాడు. ఇంకేముంది ఈ విమానాన్ని పైలెట్లు స్పెయిన్ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు.
ఇది స్పెయిన్ లో అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయం. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రతి రోజు వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అనారోగ్యం చేసిన సదరు ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు ఎయిర్ అరేబియా ఫ్లైట్ ను మాలోర్కా ఎయిర్ పోర్టులో మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే అక్కడ సిద్దంగా ఉన్న అంబులెన్స్ లో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రయాణికుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు.
ఇక్కడే ఆసక్తిరమైన ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ లో విమానంలో ఆగగానే సుమారు 22 మంది కిందికి దిగి, పరుగులు పెట్టారు. కొంత మంది ఎయిర్ పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. ఏందరుగుతుందో అర్ధం కాని పోలీసులు, కాస్త ఆలస్యంగా మేల్కొని 22 మందిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి కారణంగా విమానాశ్రయాన్ని 4 గంటల పాటు మూసివేయాల్సి వచ్చింది.
సుమారు 60 విమానాలను దారి మళ్లించారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు.స్పెయిన్ లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.