దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమై పేరుగాంచిన మహిమాన్విత క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం.భారతదేశంలో పలు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు దీక్షతో పుణ్య శబరిమల విచ్చేస్తూ ఉంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్న కఠిన తరమైన నియమాలు మరి ఏ ఇతర దీక్షలలోను ఉండవని భక్తులు భావిస్తారు.దీక్షా సమయంలో చేసే పూజలు ,భజనలు ,నియమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి, భక్తి భావాన్ని కలిగించి మనసు ప్రశాంతమై నిర్మలంగా అనిపిస్తుంది. మనిషిలో దురలవాట్లను పోగొట్టి వారిలో సాత్విక భావన కలిగించి మంచి అలవాట్లతో వారి జీవన శైలిని మార్చగలిగన ఒకే ఒక దీక్ష ,,అయ్యప్ప దీక్ష.
ఆ నియమాలన్నీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దలు ఏర్పాటు చేసినవి,మండల దీక్ష పూర్తైన వెంటనే గురుస్వామి ఆశీర్వాదం తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ‘స్వామియే శరణం అయ్యప్ప’అంటూ అనుక్షణం స్మరించుకుంటూ స్వామి దర్శనం కోసం శబరిమల చేరుకుంటారు .
అయితే గత కొద్దికాలంగా కోవిడ్ కారణంగా భక్తులకు అయ్యప్ప స్వామిని మనసారా పూజించి తరించాలన్నా ,ఎంతో భక్తిగా దీక్షబూని ఆరాధించి పూజలు చేద్దామన్నా భక్తులకు తీవ్ర అసంతృప్తి ఎదురయ్యింది .వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుత పరిస్థితి కొంచెం బాగా ఉన్నందున మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప దేవాలయం తెరచుకుంది.
ఈ సందర్భంగా అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ పూజలకు భక్తులను సైతం అనుమతించనున్నట్లు ఆలయాధికారులు చెప్పారు. 16 జూలై శుక్రవారం సాయంత్రం నుండి దేవాలయం తెరచుకోగా, శనివారం ఉదయం నుంచి భక్తులను అనుమతించారు. కోవిడ్ నేపథ్యంలో ముందుగానే బుక్ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం మొదటిసారి శనివారం ఉదయం నుంచి అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు.. కోవిడ్ టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది.దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు.ఈనెల 21వ తేదీ రాత్రి వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతిని ఇస్తున్నారు. కాబట్టి స్వామిని దర్శింఛి తరించ దలచిన వారు ఈ భాగ్యాన్ని తప్పక పొందవచ్చని తెలియజేసారు .