మన దగ్గర ఆలయాలు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయో.. వాటి దగ్గర లభించే ప్రసాదం కూడా అలానే ఫేమస్ అవుతాయి. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, శబరిమల వంటి పుణ్యక్షేత్రాల దగ్గర లభించే ప్రసాదం చాలా ఫేమస్. ఎవరైనా ఆయా ఆలయాలకు వెళ్తున్నారని తెలిస్తే.. ప్రసాదం తీసుకురమ్మని మరీ మరీ చెప్పి తెప్పించుకుంటారు. శబిరమల ప్రసాదానికి కూడా ఇలానే డిమాండ్ ఉంటుంది. శబరిలమకే ప్రత్యేకంగా నిలిచే అవరణ ప్రసాదం అంటే చాలా మంది ఇష్టపడతారు. ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది ఈ ప్రసాదం. ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌లో.. మకర జ్యోతి దర్శనం పురస్కరించుకుని.. అయ్యప్ప మాల ధరించి.. ఎంతోమంది శబరిమల వెళ్తారు. ఈ క్రమంలో తాజాగా కేరళ హైకోర్టు భక్తులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. శబరిమల అరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకో తెలియాలంటే..
అరవణ ప్రసాదం తయారీలో వినియోగించే యాలకుల్లో మోతాదుకు మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు ఆహార భద్రతా, ప్రమాణ ప్రాధికార సంస్థ తాజాగా నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు మేరకు బోర్డు వారు.. బుధవారం నుంచి అరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేశారు. అరవణ పాయసం తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని కోర్టు పేర్కొంది. ప్రసాదం రుచికి ఉపయోగించే యాలకుల్లో మెతాదుకు మించి పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు తేలిందని.. ఈ నేపథ్యంలోనే ప్రసాదం పంపిణీ నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ట్రావెన్‌కోర్ బోర్డు.. అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకులను.. గతంలో అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసేది. అయితే 2022-23 సీజన్‌లో ఈ యాలకుల కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సప్లయర్‌కు.. బోర్డు అక్రమంగా అప్పగించిందని అయ్యప్ప స్పైసెస్ కంపెనీ ఆరోపించింది. అంతేకాక.. సదరు కంపెనీ డెలివరీ చేస్తున్న యాలకుల నాణ్యతపై అయ్యప్ప స్పైసెస్ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లాబొరేటరీలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో.. శరవణ ప్రసాదం తయారీకి ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మంచి రసాయనాలు ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక ఇచ్చింది.
నివేదిక ఆధారంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రసాదం విక్రయాలను వెంటనే నిలిపివేయాలంటూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలంటూ.. ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును కోర్టు ఆదేశించింది. అయితే, యాలకులు లేకుండా చేసిన ప్రసాదం లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని కోర్టు.. ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డుకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది. మరి దేవుడి ప్రసాదాలు ఇలా కల్తీకి గురవ్వడం.. నాణ్యత పాటించకపోవడం వంటి విషయాల్లో ప్రభుత్వ తీరు సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.