చలికాలం వచ్చిందట చలి పులి అవతారం ఎత్తుతుంది. పులిని చూస్తే ఎంత భయపడతారో అంతకంటే ఎక్కువగా చలి అంటే భయపడిపోతారు జనం. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. పని చేయాలంటేనే వణుకు వచ్చేస్తుంది. ఈ గడ్డకట్టే చలిలో రోడ్డు మీద నడవాలంటేనే భయపడే పరిస్థితి. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పొగమంచు కమ్మేస్తుంది. గడ్డ కట్టేంత చలితో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయాన్నే లేచి స్కూళ్ళకి, ఆఫీసులకి రావడం అంటే వణుకుతున్నారు. దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి వణికిస్తోంది. చలి తీవ్రత పెరిగిపోవడంతో వారం రోజులు సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి.
నార్త్ ఇండియాలో ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడి చలి దెబ్బకు ఐదు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. చలి తీవ్రతకు చాలా మంది మృత్యువాత పడ్డారు. కాన్పూర్ లో చలి దెబ్బకు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 25 మంది ప్రాణాలను కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పొగమంచు, గాలి కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత ప్రమాదకరమైన స్థాయిలో ఉండడంతో ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే పొగమంచు కారణంగా 20 విమానాలను ఆలస్యంగా నడుపుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి.
మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఢిల్లీ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మరో వారం రోజుల పాటు సెలవులు ప్రకటించాయి. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్క్యులర్ ని జారీ చేసింది. శీతాకాల విరామం తర్వాత ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలలు జనవరి 9న తెరవాల్సి ఉంది. అయితే చలి తీవ్రత పెరగడంతో మరో వారం రోజులు సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు జనవరి 15 వరకూ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. మామూలుగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 9 నుంచి 12 వరకూ రెమిడియల్ క్లాసులు నడుస్తున్నాయి.
అయితే చలి కారణంగా ఈ తరగతులని కూడా నిపిలివేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఝార్ఖండ్ ప్రభుత్వం సైతం జనవరి 14 వరకూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంతకు ముందే జనవరి 3 నుంచి 8 వరకూ.. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు సెలవులు ప్రకటించింది. అయితే ఇప్పుడు చలి తీవ్రత మరీ దారుణంగా ఉండడంతో ఆ సెలవులను పొడిగిస్తూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 14 వరకూ సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాగూ సంక్రాంతి 3 రోజులు సెలవులు కాబట్టి.. ఈ మధ్య రోజులని కూడా సెలవులుగా ప్రకటించాయి ఢిల్లీ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు.