ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్ తాగేందుకు రెడీ అయ్యే జనాలు మన సమాజంలో కోకొల్లలు. ఉచితంగా వచ్చే దేన్ని వదలరు మన జనాలు. అసలే ఈ మధ్య కాలంలో ప్రతి దాని రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంట నూనె, పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రీగా పెట్రోల్, కానీ డీజిల్ కానీ లభిస్తే.. ఇక ఊరుకుంటారా.. ఎగబడిపోతారు. బకెట్లు, బిందెలు, బాటిల్స్ ఒక్కటేంటి ఏది దొరికితే దాని నిండా నింపుకెళ్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. బురద గుంతలో పెట్రోల్ ఉందని తెలిసి ఎగబడ్డారు. బకెట్లలో నింపుకుని వెళ్లారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అలీఘర్‌లో శుక్రవారం అర్థరాత్రి ఓ పెట్రోల్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది. దానిలో ఉన్న పెట్రోల్ అంతా నేలపాలయ్యింది. అది అలా ప్రవహించుకుంటూ వెళ్లి.. ఓ బురదగుంతలో చేరింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనాలు అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. కంటైనర్లు, బకెట్లు, బాటిళ్లు.. ఇలా చేతకందిన వస్తువుల్లో పెట్రోల్‌ను నింపుకుని వెళ్లారు. ఇక ఈ పెట్రోల్ ట్యాంకర్ సామార్థ్యం 24 వేల లీటర్లు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చూసిన జనాలు.. మీ కక్కుర్తి తగలడ.. ఎవరైనా మర్చిపోయి అగ్గిపుల్ల వెలిగించినా, సిగరెట్టో, బీడినో విసిరినా.. మీ పరిస్థితి ఏంటి.. మరీ ఇలా ఉన్నారేంట్రా అని కామెంట్స్ చేస్తున్నారు జనాలు.
అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.. అది ఏంటంటే ఆ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ భోజనం కోసం ట్రక్కును ఓ పక్కకు ఆపగా.. దానిని ఓ దొంగ తరలించుకుపోయాడు. ఇది గమనించిన డ్రైవర్ వెనకే వెళ్లి.. ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంల ఆ దొంగ.. డ్రైవర్ నుంచి తప్పించుకోవడం కోసం ట్రక్కును వేగంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదానికి గురై.. బోల్తా పడింది. దాంతో ఒక్కసారిగా దానిలో ఉండే పెట్రోల్ బయటకొచ్చి.. బురద గుంతలో చేరింది. విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని.. బకెట్లు, క్యాన్లు, బాటిళ్లతో పెట్రోల్ పట్టుకుని వెళ్లారు. భారీగా జనాలు ఎగబడటంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. మరోవైపు పోలీసులు పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.