మన దగ్గర సెలబ్రిటీలకు ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. ఎక్కడైనా సినిమా వాళ్లకు, క్రీడాకారులకు అభిమానులుంటారు. కానీ మన దేశంలో మాత్రం.. రాజకీయ నేతలకు కూడా సినీ, క్రీడా సెలబ్రిటీలను మించి అభిమానులుంటారు. నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతారు ఫ్యాన్స్. కొందరైతే గుడి కట్టి.. పూజలు కూడా చేస్తారు. గతంలో సోనియా గాంధీకి గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కొందరు అభిమానులు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గుడి కట్టేందుకు రెడీ అయ్యారు. విశేషం ఏంటంటే.. ముస్లింలు కూడా ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మరి ఆదిత్య నాథ్‌కు గుడి ఎందుకు కడుతున్నారు.. ఎక్కడ అంటే..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనికి ముగ్ధుడైన ఆయన అనుచరుడు ఒకరు.. యోగికి అంకితం చేస్తూ ఓ భారీ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ వీరాభిమాని పేరు ప్రభాకర్ మౌర్య. యోగి పని తీరుతో ముగ్ధుడయిన మౌర్య.. తన అభిమాన నాయకుడికి అయోధ్య జిల్లా శివార్లలోని భదర్సా ప్రాంతంలో.. యోగికి అంకితం చేస్తూ ఓ ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు మౌర్య తెలిపాడు. ఈ సందర్భంగా మౌర్య మాట్లాడుతూ.. “సీఎం యోగికి నేను వీరాభిమానిని. ఈ ఆలయం 101 అడుగుల ఎత్తు.. 50 అడుగుల పొడవు వెడల్పులతో ఉంటుంది. ఈ ఆలయంలో యోగి జీవిత క్రమాన్ని తెలిపేలా నిర్మణాలు చేపడతాం. అంతేకాక ఈ ఆలయంలో యోగిని పూజిస్తూ.. ధ్యానం చేస్తూ.. ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నాం’’ అని తెలిపాడు.
అయితే మౌర్య రెండేళ్ల కిందటే యోగి పేరిట ఆలయ నిర్మాణం చేపట్టాడు. అయితే గుడి నిర్మాణం ప్రారంభించి స్థలం భూమి యాజమాన్యానికి సంబంధించిన కొన్ని వివాదాలు తలెత్తాయి. ఫలితంగా దానిని మూసివేయాల్సి వచ్చిందని తెలిపాడు. గత అనుభవం దృష్ట్యా ఈసారి మౌర్య తన సొంత స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 24న ఆలయం భూమి పూజను నిర్వహించడానికి ప్లాన్ చేశాడు. 2027 నాటికి నిర్మాణం పూర్తవుతుందని మౌర్య పేర్కొన్నాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, హిందువులే కాకుండా.. ఈ ప్రాంతంలోని ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు కూడా ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నారు. మద్దతు ఇస్తున్నారని మౌర్య తెలిపాడు. మరి ఈ అభిమాని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.