నిలువెత్తు త్యాగానికి.. అనంతమైన ప్రేమకు.. అంతులేని జాలికి నిలువెత్తు నిదర్శనం తల్లి. బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం తన జీవితాన్ని ధారపోస్తుంది. తన ఆశలు, చిన్న చిన్న కోరికలు చంపుకుని.. పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా.. అయిన వారు దూరమైన సరే.. బిడ్డలనే ధైర్యంగా మార్చుకుని.. కష్టాల కడలిని ఎదురీదుతుంది. బిడ్డల చిరునవ్వు చూసి అప్పటి వరకు తాను అనుభవించిన కష్టాలను మర్చిపోతుంది. వారి సంతోషం కోసమే తాను బతుకుతుంది.
మొత్తంగా చెప్పాలంటే.. పిల్లలే ఆమె ప్రపంచం.. ఆమెకు సర్వస్వం. తాను ఎదుర్కొన్న కష్టాలు పిల్లలు పడకూడదని భావించి వారి కోసం అహర్నిశలు కష్టపడుతుంది. ఇక తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ఇప్పుడు మీరు చదవబోయే ఈ తల్లి కథ వింటే.. ఇలాంటి అమ్మ ఉంటే.. జీవితంలో ఎలాంటి కష్టాలనైనా సునాయాసంగా జయించవచ్చు అనిపిస్తుంది.
తమిళనాడుకు చెందిన సలీమాకు బాల్యంలోనే.. అప్పటికే విడాకులు తీసుకున్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. స్కూల్ ముఖం కూడా చూసి ఉండదు. ఇక తన జీవితానికి ఇదే ప్రాప్తం అనుకుని సరిపెట్టుకుంది. కానీ విధి రాత మరోలా ఉంది. భర్త పెద్ద తాగుబోతు. కుటుంబాన్ని పట్టించుకోకుండా.. మద్యం సేవించి రోడ్ల మీద తిరిగేవాడు. ఈ సమస్య గురించి ఎవరికి చెప్పినా లాభం లేకపోయింది. చూస్తుండగానే ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
ఓ వైపు చూస్తే భర్త తాగుబోతు.. మరోవైపు బిడ్డల ఆకలి. ఈ నేపథ్యంలో పిల్లల కడుపు నింపిందుకు, వారిని చదివించేందుకు.. విధిలేక భిక్షాటనను వృత్తిగా ఎంచుకుంది. ఓ పాఠశాలలో మరుగుదొడ్లు సైతం కడిగింది. పిల్లల కోసం కష్టపడి సంపాదించిన సొమ్మును కూడా భర్త లాక్కెళ్లడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. పగలంతా రోడ్డు మీద భిక్షాటన చేస్తూ.. రాత్రుళ్లు.. ఆరుగురు ఆడపిల్లలతో కలిసి రోడ్డు మీదనే పడుకునేది. ఏ రోజు ఆ తల్లికి కంటి నిండా నిద్రపట్టలేదు.
భిక్షాటన ద్వారా పోగు చేసిన డబ్బుతో కొన్నాళ్లకు మౌంట్ రోడ్డు దర్గా ప్రాంతంలో చిన్న పూల దుకాణం పెట్టుకుంది. ఇక పాఠశాలలో మరుగు దొడ్లు కడిగే సమయంలో సలీమా ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఓ సిస్టర్ ఆమె పెద్ద కుమార్తెకు ఉచితంగా చదువు చెప్పడానికి అంగీకరించింది. ఇక మిగతా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చింది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. పిల్లలను మాత్రం బడి మానిపించలేదు.
అయితే తల్లి ఇంతలా కష్టపడటం చూసిన సలీమా పిల్లలు ఆమెకు సాయం చేస్తామని అడిగేవారు. అందుకు సలీమా ఒప్పుకునేది కాదు. ‘‘నా కష్టం నాతోనే పోవాలి.. మీ జీవితాలు నాలా కాకూడదు. నాకు అక్షరజ్ఞానం లేదు కాబట్టి ఇంత కష్టపడాల్సి వస్తుంది. మీరు ఇవేం పట్టించుకోకుండా చదువు మీద శ్రద్ధ పెట్టండి. మీరు జీవితంలో స్థిరపడితే నాకదే చాలు’’ అని పిల్లలకు చెప్పేది. ఈ కష్టాలు చాలవన్నట్లు.. వానాకాలంలో వీరు ఉండే గుడిసెలో నీరు కారేది.. పాముల వచ్చేవి. దాంతో భయపడి రైల్వే స్టేషన్‌లో రాత్రిపూట తలదాచుకునేవారు.
సలీమా కష్టం చూస్తూ పెరిగిన పిల్లలు ఆ తల్లి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకుంటున్నారు. పెద్ద కుమార్తె బీకాం పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేరవుతుంది. మరో కుమార్తె లా ఫైనలియర్‌లో ఉండగా.. మిగతా వారు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. వీరి పరిస్థితి గమనించిన ప్రభుత్వం వీరికి పెరుంబాక్కలో ఇల్లు కేటాయించింది.
ఈ సందర్భంగా సలీమా మాట్లాడుతూ.. ‘‘వయసు మీద పడటంతో అప్పుడప్పుడు నీరసం వస్తుంది. కానీ నా పిల్లల భవిష్యత్తు గుర్తుకు రాగానే నాలో ఎక్కడా లేని శక్తి ప్రవేశిస్తుంది. నా పిల్లలు బాగా చదువుకుని వారి కాళ్ల మీద వారు నిలబడితే నాకదే చాలు’’ అంటుంది. సలీమా కథ తెలిసిన వారు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి జీవితాలను అంతం చేసుకునేవారికి మీరు ఆదర్శం అంటూ పొగుడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.