కరోనా.. ఈ పదం వింటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. కరోనాతో వచ్చిన లాక్ డౌన్ వల్ల ఎందరో ఉద్యోగాలు పోయి నిరుద్యోగులయ్యారు. ఎందరో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూటగడవక నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఓ టీచర్ మాత్రం కరోనా వల్ల లక్షాధికారి అయ్యాడు. అవును.. కరోనా వల్లే ఆ ప్రైవేటు స్కూల్ టీచర్ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. అసలు అతను ఏం చేస్తున్నాడు? ఎంత సంపాదిస్తున్నాడో చూద్దాం.
రాజస్థాన్ లోని అజ్మేర్ సిటీ దగ్గర్లో రసూల్‌పుర అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రజా మహ్మద్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ రావడంతో అతని ఉద్యోగం కాస్తా ఊడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కుటుంబాన్ని ఎలా పోషించాలి అనే సంగిద్ధంలో పడిపోయాడు. అలాంటి సమయంలో అతనికి తెలిసిన వ్యక్తి ముత్యాల సాగు చేపట్టాల్సిందిగా సూచించాడు.
ఆ సమయంలో అతను ఇచ్చిన ఆ చిన్న ఆలోచన ఇప్పుడు రజా మహ్మద్ లక్షలు సంపాదించేలా చేసింది. కొన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత రజా మహ్మద్ ముత్యాల సాగు చేసేందుకు పూనుకున్నాడు. కానీ, ఎలా చేయాలి అనేది మాత్రం తెలియదు. ఆ సమయంలో రాజస్థాన్ కు చెందిన నరేంద్ర కుమార్ గర్వా అనే ముత్యాల సాగు చేసే వ్యక్తిని కలిశాడు. అతను రజాకి ముత్యాల సాగు గురించి రెండ్రోజులపాటు ట్రైనింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత రజా మహ్మద్ ముత్యాల సాగు మొదలు పెట్టేశాడు. తన పాలు ఎకరం స్థలంలో చిన్న కుంట తీయించాడు. దేశంలో పలు ప్రాంతాల నుంచి ఆలుచిప్పలను తెప్పించుకున్నాడు. మొదటి బ్యాచ్ గా వెయ్యి ఆలుచిప్పలతో ముత్యాల సాగు ప్రారంభించాడు. ఈ ముత్యాల సాగుకు దాదాపు 15 నెలల నుంచి 20 నెలల సమయం పడుతుంది.
ఎవరికైనా ముత్యాల సాగులో మొదటిలోనే 25 శాతం ఆలుచిప్పలు పాడై పోతాయి. ఆ తర్వాత ముత్యాలు చేతికి వచ్చే సమయానికి మొత్తం 50 శాతం ఆలుచిప్పలు చెడిపోతాయి. ఈ ముత్యాల సాగులో నష్టం ఉన్నా.. మంచి ముత్యాలు చేతికి అందితే మాత్రం లాభాల పంట పండుతుంది. అలా రజా మహ్మద్ ముత్యాల సాగులో నిపుణుడు అయిపోయాడు. ప్రస్తుతం తనకున్న చిన్న కుంటతోనే రజా మహ్మద్ ఒక బ్యాచ్ కు దాదాపు రూ.2 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నాడు.
రజా ముత్యాల సాగు చేయడమే కాకుండా ఎంతో మంది ఔత్సాహికులకు అందులో శిక్షణ కూడా ఇస్తున్నాడు. ప్రభుత్వం తరఫున సెంటర్ ఫర్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్(సీఐఎఫ్‌ఏ) కూడా శిక్షణ ఇస్తుంటుంది. 15 రోజుల పాటు ముత్యాల సాగులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు. ముత్యాల సాగుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం సీఐఎఫ్‌ఏ అధికారిక వెబ్ సైట్‌ని పరిశీలించండి. రజా మహ్మద్ ముత్యాల సాగుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.