భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. 2023 జూలై 11 నుంచే కార్యకలాపాలు కొనసాగించకూడదని ఈ రెండు బ్యాంకులను ఆర్బీఐ హెచ్చరించింది. మరి ఈ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు తిరిగి వస్తాయా? లేదా? రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్ ఎవరికి వర్తిస్తుంది? అనే వివరాలు మీ కోసం.
రిజర్వ్ బ్యాంక్ మరో రెండు బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. బ్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడం, ఆదాయ అంచనాలు లేకపోవడం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లఘించడం వంటి కారణాల వల్ల బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేయడం జరుగుతుంది. తాజాగా ఆర్బీఐ రెండు బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేసింది. వాటిలో ఒకటి శ్రీ శారదా మహిళా కో ఆపరేటివ్ బ్యాంక్ కాగా.. మరొకటి హరిహరేశ్వర్ సహకారి బ్యాంక్. శ్రీ శారదా మహిళా కో ఆపరేటివ్ బ్యాంక్.. కర్ణాటక తుమకూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించగా.. హరిహరేశ్వర్ సహకారి బ్యాంక్ మహారాష్ట్ర సతారాలోని వాయ్ కేంద్రంగా పని చేసేది. తాజాగా ఆర్బీఐ ఈ రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది.
ఈ బ్యాంకుల వద్ద తగినంత మూలధన నిల్వలు లేకపోవడం, పెద్దగా ఆదాయ అంచనాలు కూడా లేకపోవడంతో లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. హరిహరేశ్వర్ బ్యాంక్ జూలై 11న మూతపడినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక నుంచి ఈ బ్యాంకులో ఎలాంటి కార్యకలాపాలు జరగవని.. డిపాజిట్లు తీసుకోవడం, రీపేమెంట్లు చేయడం కూడా కుదరదని వెల్లడించింది. అయితే హరిహరేశ్వర్ సహకారి బ్యాంక్ డిపాజిటర్లలో 99.96 శాతం మందికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద మొత్తం డబ్బులు తిరిగి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. శ్రీ శారదా మహిళా కో ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లు 97.82 శాతం మంది ఇప్పటి వరకూ డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి పొందుతారని వెల్లడించింది.
అయితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ తీసుకున్న వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన దాంట్లో రూ. 5 లక్షల వరకూ క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీతో కలిపే రూ. 5 లక్షల వరకూ చేతికొస్తాయి. అంతకంటే ఎక్కువ డబ్బు డిపాజిట్లు చేసిన వారికి మాత్రం లాభం ఉండదు. అందుకే మంచి బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం ఉత్తమం. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర బుల్దానాలోని మల్కాపూర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, కర్ణాటక బెంగళూరులోని సుశ్రుతి సౌహార్ద సహకార బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. తాజాగా మరో రెండు బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేసింది.