రైళ్ల మీద దాడులు చేస్తున్న ఘటనలు ఈమధ్య పెరిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా వివరాలు..
ఇటీవల కాలంలో రైళ్లపై దాడులు పెరిగిపోయాయి. ట్రైన్స్‌పై రాళ్లు రువ్వడం ఎక్కువైపోయాయి. దీంతో రైళ్లలో ప్రయాణిస్తున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్ల మీద ఇలాంటి దాడులు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రైళ్లపై రాళ్లు రువ్వినా, దాడులు చేసినా నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. ప్రయాణికులకు ముప్పు వాటిల్లేలా, రైల్వే శాఖ ఆస్తులకు నష్టం కలిగించేలా రాళ్లు రువ్వడం లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) వెల్లడించింది.
ఇటీవల దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రైళ్లపై రాళ్లు రువ్విన పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. కాజీపేట-ఖమ్మం, కాజేపట-భువనగిరి, ఏలూరు-రాజమండ్రి ప్రాంతాల్లో వందేభారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. 2023 జనవరి నుంచి రైళ్ల మీద రాళ్ల దాడి ఘటలు తొమ్మిది జరిగాయి. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అదే సమయంలో రైల్వే శాఖ ఆస్తులకు కూడా నష్టం కలుగుతోంది.
అందుకే అలర్ట్ అయిన దక్షిణ మధ్య రైల్వే, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇక మీదట ఎవరైనా రైళ్లపై దాడి చేస్తే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. మరోవైపు రైళ్ల మీద రాళ్లు రువ్వడం లాంటి ఘటనలు జరగకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయనుంది. ట్రాక్‌ల సమీపంలోని గ్రామాల సర్పంచ్‌లతో సమన్వయం చేయడంతో పాటు వారిని గ్రామ మిత్రలుగా చేయడం లాంటి నివారణ చర్యలు చేపట్టనుంది. మరి.. రైళ్లపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.