ఎన్నికలు వస్తున్నాయంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు రెడీ అయిపోతారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఓటర్లను ప్రభావితం చేయడానికి అభ్యర్థులు డబ్బులు పంచిపెడతారు. ఎన్నికల ముందు వరకూ పథకాలు అందాయా? రోడ్డు పనులు పూర్తయ్యాయా? ఊరు ఎలా ఉంది? మీ కుటుంబం ఎలా ఉంది? మీ పరిస్థితి ఏంటి? అనే విషయాలు పట్టించుకోరు. కానీ ఎన్నికలు వచ్చాయంటే ఇక అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు అందరూ జనం మీద పడిపోతారు. ఏమ్మా డబ్బులు అందాయా? అన్న మందు సీసా అందిందా? అంటూ పలకరించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎప్పుడూ పారనంత డబ్బు ఈ ఎన్నికల్లో మాత్రం విచ్చలవిడిగా.. మందు, బిర్యానీ, డబ్బుల రూపంలో ఏరులై పారుతుంది. ఓట్లను సంతలో పశువులను కొన్నట్టు కొనేస్తారు. తాజాగా ఎన్నికల్లో గెలవడం కోసమని ఒక్కో ఇంటికి రూ. 30 వేలు, ఒక కోడిని పంచినట్లు సమాచారం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు గట్టిగానే డబ్బులు పంచిపెట్టినట్లు సమాచారం.మొత్తం 224 నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయగా.. వీటిలో ఎక్కువ మొత్తం పంపిణీ చేసిన నియోజకవర్గంగా బళ్లారి సిటీ ఉందని ప్రచారం జరుగుతోంది. బళ్లారి సిటీలో 2,59,184 మంది ఓటర్లు ఉండగా.. దాదాపు 2 లక్షల మంది ఓటర్లకు ఒక్కో ఓటరుకి రూ. 5 వేల వరకూ పంపిణీ చేసినట్లు సమాచారం. ఎన్నికల బరిలో నిలబడిన ముగ్గురు అభ్యర్థులు ఓటుకు నోటు పంచినట్లు తెలుస్తోంది. అయితే జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీ తరపున పోటీ చేసిన ప్రధాన అభ్యర్థి ద్వారా ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరగడంతో చర్చనీయాంశంగా మారింది.
ఇక బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలో 2,38,326 మంది ఓటర్లు ఉండగా.. వీరికి రూ. 3 వేలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీల తరపున ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఈ డబ్బును పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే కుటుంబానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు వరకూ పంచినట్లు బళ్లారిలో టాక్ నడుస్తోంది. బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాల్లో దాదాపు రూ. 250 కోట్లు ఓటర్లకు పంచినట్లు సమాచారం. అలానే ఇంటికో కోడిని కూడా పంపిణీ చేశారు. మరి ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఓటర్లకు అభ్యర్థులు ఇలా డబ్బు, కోడి పంచడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.