సాధారణంగా చాలా మంది ఆహ్వానం వస్తే కాని పెళ్లిళ్లకు వెళ్లారు. ఇంకా కొందరు అయితే తమను ప్రత్యేకంగా వచ్చి పిలవలేదంటూ అలకపాన్పు ఎక్కుతారు. అయితే మరికొందరు మాత్రం ఎంతో చక్కగా రెడీ అయ్యి.. పిలవని పెళ్లికి కూడా హాజరవుతుంటారు. అక్కడ ఎంచక్కా అందరిలో కలిసిపోయి తిరుగుతుంటారు. అంతేకాక పెళ్లి భోజనాలను హాయిగా లాగించి.. అక్కడి నుంచి జంప్ అవుతుంటారు. ఇలా అనేక పెళ్లిళ్లలో ఆహ్వానం లేకుండా వెళ్లి చాలా మంది భోజనాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా యువకులు ఇలాంటి అల్లరి పనులు చేస్తుంటారు. పెళ్లివారు అలాంటి వారిని గుర్తించిన చిన్న హెచ్చరిక చేసి వదిలేస్తారు. అయితే ఓ పెళ్లి పెద్దలు మాత్రం..పిలవకుండా పెళ్లికి వచ్చి.. భోజనం చేశాడని ఓ యువకుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. అతడి చేత పెళ్లిలో తిన్నవారి ప్లేట్లను కడిగించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ఓ యువకుడు భుపాల్ లోని ఓ ప్రైవేటు కాలేజిలో ఎంబీఏ చదువుతున్నాడు. స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్తుండే వాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ యువకుడు నివసించే ప్రాంతంలో పెళ్లి వేడుక జరుగుతుంది. దీంతో పెళ్లిలో చాలా రకాల ఆహారం వడ్డిస్తారని భావించాడు. వాటిని ఎలాగైన ఆరగించాలని అనుకున్నాడు. అందుకే పెళ్లివారు పిలవకున్న ఆ వేడుకకు వెళ్లి… వివాహ విందును ఆరగించాడు. అయితే వధువరుల తరుపు వారు ఆ యువకుడిని బయటి వ్యక్తిగా గుర్తించి..పట్టుకున్నారు. ఆ యువకుడిపై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు?’ అంటూ అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఎంబీఏ విద్యార్ధినని, పొరపాటున పెళ్లిలోకి వచ్చానని తెలిపాడు.
తాను పిలవకుండానే పెళ్లికి వెళ్లి భోజనం చేసినట్లు కూడా చెప్పాడు. తాను స్టూడెంట్ అని చెప్పిన ఆ పెళ్లి పెద్దలు వదల్లేదు. పిలవని పెళ్లికి వచ్చి భోజనం చేశాడని ఆ ఎంబీఏ విద్యార్ధితో గిన్నెలు కడిగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు పలు రకాలు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మనుషుల్లో మానవత్వం లేదంటున్నారు. పిలవని పేరంటానికి వెళ్లి హాయిగా నచ్చింది తిని ఎంజాయ్ చేయడం.. హోటల్ లో తిని బిల్లు కట్టకుండా గిన్నెలు కడిగే.. సంఘటనలు మనం సినిమాల్లో చాలానే చూశాం. కానీ నిజ జీవితంలో పిలవని పెళ్లికి వెళ్లి.. ఇలా పేట్లు కడగడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి.