నూటికో కోటికో ఒక్కరు. ఎప్పుడో ఎక్కడో పుడతారు. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగ నిలిచాడు. జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి. అలాంటప్పుడు అతనే ఆదర్శపురుషుడు అవుతాడు. అవును… అతడు మంచినీటి కోసం గ్రామ ప్రజలు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేకపోయాడు. కూలీలను నియమించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఒక్కడే తన పొలంలో 32 అడుగుల బావి తవ్వేశాడు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడిగా మారాడు. కర్ణాటకలోని అంకోలా తాలూకాకు చెందిన మంజుగుని గ్రామ వాసి మహాదేవ మంకాలు రోజు కూలీగా జీవనం సాగిస్తున్నాడు.
ప్రతి యేటా వేసవిలో తమ గ్రామంలోని 60 ఇళ్ల వాళ్లు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతుండడం గమనించాడు. దాంతో తన పొలంలో బావి తవ్వాలని నిర్ణయించుకున్నాడు. బావి తవ్వడానికి పనివారిని నియమించుకోనే ఆర్థిక స్థోమత తనకు లేదు. దీంతో మొదటి లాక్‌డౌన్ సమయంలో ఒక్కడే తవ్వడం మొదలుపెట్టాడు. లాక్‌డౌన్ పూర్తయ్యేసరికి 28 అడుగులు తవ్వాడు. అయితే ఆ లోతులో నీరు పడలేదు. మళ్లీ రెండో లాక్‌డౌన్ మొదలయ్యాక బావి పని మొదలుపెట్టాడు. ఈ సారి మరో 4 అడుగులు తవ్వేసరికి 32 అడుగుల లోతులో నీరు పడింది. ఇప్పుడు ఆ బావి నీటితోనే గ్రామస్థులు దాహార్తిని తీర్చుకుంటున్నారు. మహాదేవ చేసిన పనిని వారంతా ప్రశంసిస్తున్నారు. తమ తాగునీటి కష్టాలు ఇక తీరినట్టేనని మురిసిపోతున్నారు.