తల్లి కోసం ఏ కుమారుడు చేయని పనిని అతడు చేశాడు. 14 ఏళ్ల వయసులోనే ఏకంగా 20 అడుగల బావి తవ్వాడు. ఆ బావిని తన కన్న తల్లికి కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం అతడి స్టోరీ..
పిల్లల కోసం కష్టపడే తల్లుల గురించి మనం చాలా వార్తలు చదివి ఉంటాము. కానీ, తల్లుల కోసం కష్టపడే పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారి గురించి చాలా తక్కువ వార్తలు వస్తూ ఉంటాయి. తాజాగా, ఓ 14 ఏళ్ల బాలుడు తల్లి కోసం ఎంతో సాహసం చేశాడు. తల్లి నీళ్లు తేవటానికి ఎంతో కష్టపడుతోందని తెలిసి ఓ పెద్ద బావిని తవ్వాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాలగర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల ప్రణవ్ రమేష్ సల్కర్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.
అతడు నివసించేది ఓ ఆదివాసీ ప్రాంతం. ఆ ఊర్లో మొబైల్ ఫోన్స్, పిజ్జాలు, గూగుల్ మ్యాప్ ఏవీ ఉండవు. అలాంటి మారు మూల గ్రామంలో పుట్టాడు. అతడి తల్లి నీళ్లు తీసుకుని రావటానికి ఎంతో కష్టపడుతూ ఉండేది. దగ్గరలో ఉన్న నది నుంచి నీళ్లు తీసుకురావటానికి కిలోమీటర్లు ప్రయాణించేది. తల్లి కష్టాన్ని చూసి ప్రణవ్ అల్లాడిపోయాడు. తల్లికి ఏదైనా సహాయం చేయాలని భావించాడు. తల్లి కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకునే బాధ తప్పాలంటే తాను ఓ బావి నిర్మించాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా బావిని తవ్వటానికి ప్రణాళికలు రచించాడు. బావిని తవ్వడానికి రోజులో 10 గంటలకు పైగా కష్టపడేవాడు. మధ్యలో ఓ 15 నిమిషాలు మాత్రమే భోజన విరామం తీసుకునేవాడు. అలా కష్టపడి దాదాపు 20 అడుగుల బావిని తవ్వాడు. ఆ బావిని తల్లికి అంకితం ఇచ్చాడు. తల్లి కష్టాన్ని తీర్చడానికి ప్రణవ్ చేసిన పని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇది తెలిసిన జనం అతడ్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి, తల్లి కోసం ఏకంగా 20 అడుగుల బావి తవ్విన ప్రణవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.