స్నేహం అవసరాలకు వినియోగించుకునే వస్తువు కాదూ. ఆపదలో ఆదుకునే బంధువు స్నేహితుడు. ఎంతో కాలంగా ఓ సమస్యతో ఇబ్బంది పడుతున్న తన స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలవడమే కాదూ.. ఆ సమస్యను నుండి శాశ్వతంగా గట్టెక్కించారు మహిళలు. ఇంతకు వారు చేసిన ఉపకారం ఏంటంటే.?
ఎండాకాలం వచ్చిదంటే దడపుట్టించే ఉష్ణోగ్రతలు, వడగాలులే కాదూ.. విపరీతమైన దాహం వేస్తుంది. ఇక ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లాల్సిందే. లేదంటే ఆ సమయంలో నీళ్ల వ్యాపార దందా నడుస్తుంది. దీంతో వారు డిమాండ్ చేసినంత ఖర్చు పెట్టి దాహం తీర్చుకోవాల్సిందే. అయితే మామాలుగానే నీళ్లు దొరకని ప్రాంతాలు దేశంలో అనేకం ఉన్నాయి. ఇక ఎండాకాలంలో ఆ ప్రాంతాల పరిస్థితి చెప్పనలవి కాదు. గుక్కెడు నీళ్లు కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. లేదంటే వాటర్ డబ్బాలు, ట్యాంకులకు వేలు పోయాల్సిందే. ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది కేరళలోని ఓ ప్రాంతం.
కేరళలోని పతనంతిట్ట జిల్లాలో వేసవి వచ్చిందంటే చాలు నీళ్లు దొరకడం కష్టం. అటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది 45 ఏళ్ల జెస్సీ సాబు అనే కుటుంబం. నారనంముంజి ప్రాంతంలో నివసిస్తున్న ఈ కుటుంబం కొన్నేళ్లుగా తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని నీటి అవసరాలకే ఖర్చు పెడుతున్నారు. నీటి కొరతను తీర్చుకునేందుకు వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించే వారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి కోసం ఎన్నో అగచాట్లు పడేది ఈ కుటుంబం. ఇక సమ్మర్ లో నీటి ధరలు కొండనెక్కుతాయి. అయినా తప్పక కొనాల్సిన పరిస్థితి. దీంతో 2 వేల లీటర్ల నీటికి రూ. వెయ్యి చెల్లించాల్సి వచ్చేది. ఆ నీరు కూడా వారం రోజులు మాత్రమే వచ్చేది. ఇక బట్టలు ఉతకాలంటే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంపానదికి ఆటోకు రూ. 400 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
ఈ నీటి కష్టాలతో విసిగిపోయిన జెస్సీ కుటుంబం బావిని తవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అది 1.5 నుండి 2 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. అంత డబ్బులు కూలీలకు చెల్లించలేని పరిస్థితి. ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ వారు చిన్నవారు కావడంతో తామే స్వయంగా బావిని తవ్వాలని నిర్ణయించుకుంది ఆ కుటుంబం. మార్చి 2న ప్రారంభించారు. అయితే సాబు సంపాదనపైనే కుటుంబం పడటంతో ఆమె పనులకు వెళ్లిపోయేది. ఆమె కష్టాన్ని గ్రహించిన స్నేహితులు ఆపన్న హస్తం అందించారు. జేస్సీ దీనస్థితిని చూసి అతని స్నేహితురాలు మరియమ్మ థామస్, లీలమ్మ జోస్, ఉషా కుమారి, లిల్లీ కెకె, కొచుమోల్, రెజిమోల్, అను థామస్ ముందుకు వచ్చారు. మార్చి 4 నుండి బావిని తవ్వడం మొదలు పెట్టారు. ఆ రోజు నుండి తవ్వుతూ ఉండేవారు. రోజూ ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పని చేసేవారు.
ఆమె కోసం వారు కూలీలయ్యారు. నాలుగు అడుగులు భూమి లోపలికి వెళ్లాక స్నేహితులకు కష్టాలు మొదలయ్యాయి.కింద గట్టి రాళ్లు కనిపించడంతో కొంత నిరాశకు గురైన నీరు వచ్చేంత వరకు పనిని ఆపకూడదని స్నేహితులు నిర్ణయించుకున్నారు. దీని కోసం నిపుణుల సహాయం తీసుకున్నారు. ఈ విషయం వార్డు సభ్యులకు తెలిసింది. పంచాయతీ అధికారులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం( మనేగ్రా) పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆమోదం తెలిపారు. మొత్తం 21 రోజుల పాటు బావి తవ్వడానికి శ్రమించారు స్నేహితులు.. చివరికి వారి అలుపెరగని కృషి ఫలించింది. బావిలో నీళ్లు పడ్డాయి. ఫ్రెండ్ సర్కిల్‌కు రోజుకు రూ.311 వేతనం కూడా అందింది. బావి పూర్తయ్యాక సాబు కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. కృతజ్ఞతలు తెలియజేయడానికి పదాలు కూడా రావడం లేదన్న జెస్సీ సాబు..వారి రుణం తీర్చుకోలేనని ఆనందం వ్యక్తం చేశారు.