పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు.. విపరీత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. విద్యార్థులను సొంత బిడ్డల మాదిరి చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఇక కొందరు టీచర్లు.. ప్రచారం కోసం చేసే పనులు విద్యార్థులను అల్లరి పాలు చేస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ ఉపాధ్యాయుడు.. అత్యుత్సాహం కొద్ది.. విద్యార్థిని యూనిఫామ్ విప్పించి.. శుభ్రంగా ఉతికి.. ఆరబెట్టి.. ఆతర్వాత తొడిగి.. అప్పుడు క్లాస్‌లోకి పంపాడు. యూనిఫామ్ ఆరేంత వరకు.. ఆ విద్యార్థిని అర్ధనగ్నంగా అలానే ఉంది. ఇక సదరు ఉపాధ్యాయుడు తన ఘనకార్యానికి సంబంధించిన ఫోటోను విద్యాశాఖ గ్రూపులో పోస్ట్ చేయడంతో దీనిపై వివాదం రాజుకుంది. దాంతో కలెక్టర్ సదరు టీచర్‌పై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సంఘటన మధ్యప్రదేశ్, శహడోల్ జిల్లా జైసింగ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని ఒకరు మాసిన యూనిఫామ్‌తో రావడం ఆ టీచర్ గమనించాడు. వెంటనే విద్యార్థిని దగ్గరకు వెళ్లి.. ఆమె దుస్తులు విప్పించి.. తానే శుభ్రంగా ఉతికాడు సదరు ఉపాధ్యాయుడు. అది ఆరాక విద్యార్థినికి ఇచ్చి.. ఆ తర్వాత క్లాస్‌లోకి పంపాడు.
అంతసేపు విద్యార్థిని అర్ధనగ్నంగానే ఉంది. ఈ సందర్భంగా సదరు ఉపాధ్యాయుడు తాను చేసే పనిని ఫోటో తీసి.. దాన్ని విద్యాశాఖ గ్రూపులో షేర్ చేశాడు. అంతేకాక తాను శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తానని.. అందుకే మురికి యూనిఫామ్‌ని తానే స్వయంగా ఉతికి ఆరబెట్టానని తెలిపాడు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సదరు టీచర్ మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దాంతో జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి.. సదరు టీచర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.