ఎప్పుడో 1978లో ఒక కంపెనీ షేర్లు కొన్నాడు. కొంతకాలనికి ఆ సంగతే మర్చిపోయాడు. తీరా 2015లో ఇల్లు సదురుతుంటే పాత కాగితాల్లో ఫిజికల్ షేర్ డాక్యుమెంట్లు కంటపడ్డాయి. వాటిని పూర్తిగా చదివితే తాను 43 ఏళ్ల క్రితం ఒక కంపెనీ చెందిన 3500 షేర్లు కొన్నట్లు గుర్తొచ్చింది. దాని గురించి పూర్తిగా ఆరా తీయగా రూ.1443 కోట్లకు తను యజమాని అని తెలుసుకుని షాక్ తిన్నాడు. పైసల కోసం ఆ కంపెనీని సంప్రదిస్తే తనకు జరిగిన మోసం బయటపడింది. దాంతో న్యాయపోరాటం ప్రారంభించాడు కేరళలోని కోచ్చికి చెందిన బాబు జార్జ్. 1978లో బాబు జార్జ్ వాలవి, అతని నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చెందిన మెవార్ ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ అనే ఒక అన్ లిస్టెడ్ కంపెనీలో 3500 షేర్లు కొనుగోలు చేశాడు. అప్పట్లో వాలవీ ఈ సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు.
ఆ సమయంలో ఈ కంపెనీలో 3500 షేర్లు కొన్నాడు. అప్పట్లో సంస్థ చైర్మన్ పిపి సింఘాల్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కొనుగోలు చేసిన షేర్ల విలువ సంస్థలో 2.8 శాతం వాటాగా మారింది. అయితే ఇది అన్ లిస్టెడ్ కంపెనీ కావడం, డివిడెండ్లు ఇవ్వకపోవడంతో కమ్యూనికేషన్ పెద్దగా లేదు. దీంతో ఈ పెట్టుబడి గురించి వాలవి ఫ్యామిలీ కూడా పెద్దగా పట్టించుకోకపోవంతో మర్చిపోయింది. బాబు 2015లో ఏదో పాత డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నప్పుడు ఈ ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో వాటి గురించి తెలుసుకుందామని ఆరా తీయగా, తెలిసిన సమాచారంతో అతను, అతని కుటుంబాన్ని మతిపోయేలా చేసింది. ఎందుకంటే మెవార్ ఆయిల్ కంపెనీ ఆ తర్వాత పేరు మారి పిఐ ఇండస్ట్రీస్ అయింది. దాని పనితీరు ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఫిజికల్ షేర్లను డీమ్యాట్‌లోకి మార్చుకుందామని ఆయన ప్రయత్నిస్తే.. అది కుదర్లేదు. నేరుగా రిజిస్ట్రార్ లేదా కంపెనీని సంప్రదించాలని బ్రోకర్లు సూచించారు. కంపెనీకి వెళ్తే సదరు షేర్లు లేవని, వాటిని 1989లోనే ఇతరులకు అమ్మేసినట్టు సమాచారం ఉందని తేల్చేసింది. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేసేందుకు అప్పట్లో వాలవి కుటుంబం సిద్ధమైంది. ఇక చేసేది లేక కంపెనీ ఇద్దరు సీనియర్ ఉద్యోగులను కోచ్చికి పంపి డాక్యుమెంట్ల నిజనిర్ధారణ చేసుకుంది. ఆ తర్వాత దీనిపై కంపెనీ సెటిల్మెంట్ చేసుకునేందుకు యత్నించడంతో వాలవి నిరాకరించారు. వాలవి మాటల ప్రకారం అప్పట్లో 13 మందికి తన దగ్గరున్న షేర్లను అక్రమంగా దొంగ సర్టిఫికెట్లను సృష్టించి విక్రయించారని, ఇందులో అప్పటి కంపెనీ సెక్రటరీ పాత్ర ఉందని ఆరోపించారు. ఇప్పుడు లెక్కించి చూస్తే.. వాలవి మాటల ప్రకారం దగ్గర 42.8 లక్షల పిఐ ఇండస్ట్రీస్ షేర్లు ఉండాలి. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు ఉంది. కాగా, ఈ వ్యవహారంపై వాలవి సెబీ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.