కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంట మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించి.. మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలకు పైగా గెలుచుకుంది. దాంతో కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది అనే క్లారిటీ వచ్చింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సీనియర్ నేత సిద్ధరామయ్య.. గెలుపు సంబరాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. కన్నడ నాట కాంగ్రెస్ విజయం సాధించడంతో.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా.. సిద్ధ రామయ్య ఇంట మాత్రం విషాదం నెలకొంది. ఫలితాల రోజునే ఆయన ఆత్మీయులు తుది శ్వాస విడిచారు. దాంతో సిద్ధరామయ్య ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ మృతి చెందారు. శనివారం ఉదయం గౌడ అస్వస్థతకు గురికావడంతో.. వెంటనే ఆయనను మైసూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగానే.. ఆయన తుదిశ్వాస విడిచారు. రామేగౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. రామేగౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సాయంత్రం సిద్ధరామనహుండిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పార్టీ గెలిచినా.. దాన్ని ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా పోయింది. రామేగౌడ మృతి నేపథ్యంలో బంధువులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు.
ఇక కన్నడ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దాదాపుగా ఖరారయిన వేళ.. కొత్త సమస్య వచ్చి పడింది. సీఎం అభ్యర్థి ఎవరు దానిపై జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ సీనియర్ నేతలైన సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరు సీఎం రేసులో ఉన్నారు. మరి అధిష్టానం వీరిలో ఎవరికైనా చాన్స్ ఇస్తుందా లేక.. కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకువస్తుందా చూడాలి. ఈ ఇద్దరు నేతలు మాత్రం సీఎం కుర్చీ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.