పేదలకు ఉచిత విద్యతో పాటు.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు నేతలు. ఎక్కడ అంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా.. మరి కొన్ని చోట్ల త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు జనాలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిద్ధరామయ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక గెలుపుతో.. మిగతా రాష్ట్రాల్లో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో తర్వలోనే ఎన్నికలు జరగబోయే తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నేతలు తమ మధ్య ఉన్న విబేధాలను పక్కకు పెట్టి ఏకతాటిపైకి వచ్చారు. అంతేకాక ప్రజలపై హామీల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. పేదలకు రూ.500లకే వంట గ్యాస్ అందిస్తామని.. కేజీ టు పీజీ ఉచిత, నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 800 కి.మీ. పూర్తయిన సందర్భంగా గురువారం (మే 25) జడ్చర్లలో రాజీవ్ గాంధీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. కాంగ్రెస్ నేతలందరూ విభేదాలను పక్కనబెట్టి ఈ సభా వేదికగా ఏకతాటిపైకి వచ్చారు. కేడర్‌కు సానుకూల సంకేతాలను అందించగలిగారు. కాంగ్రెస్ నేతలంతా ఇలా ఒకే వేదికపై కనిపించడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. పాదయాత్రలో గిరిజనులు కష్టాలు కళ్లారా చూశాను. కాంగ్రెస్ పార్టీ పంచిన అటవీ భూములను కేసీఆర్ గుంజుకున్నారు. పాదయాత్రలో పోడు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు’’ అని భట్టి తెలిపారు. అంతేకాక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని.. తాము అధికారంలో రాగానే రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు ఆస్పత్రి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అని తెలిపారు.