ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కావడం అంటే అంత సామాన్య విషయం కాదు. దీని కోసం అహోరాత్రులు కష్టపడాలి, మరేన్నో త్యాగం చేయాలి. పేదరికంలో ఉన్న సామాన్య కుటుంబానికి చెందిన ఓ తండ్రి తన కొడుకు ఐపీఎస్ అధికారి కావాలని ఎన్నో కలలు కన్నాడు. తండ్రి కలను సాకారం చేయాడనికి ఆ కొడుకు తన సంతోషాలు వదులుకోని కష్ట పడ్డాడు. చివరికి తండ్రి కొడుకుల కష్టం ఫలించింది. అనుకున్నది సాధించాడు ఆ పుత్రుడు.
అయితే ఇలా ఐపీఎస్ అయిన తరువాత సాధారణంగా ఆ వ్యక్తి కుటుంబ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది. చిన్న ఇల్లు పోయి పెద్ద బంగ్లా, కార్లు విలాసవంతమైన జీవితం వచ్చేస్తుంది. కానీ ఓ కుటుంబం విషయంలో అలా జరగలేదు. కొడుకు ఐపీఎస్ అయినా.. ఆ తల్లిదండ్రులు ఇంకా రేకుల షెడ్ లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఆ తండ్రి ఇంకా కష్టం చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఎవరా ఆ కొడుకు..ఏంటి ఆ కథ చూద్దాం..!
కర్ణాటకలోని బెళగావి జిల్లా లో మోలే గ్రామంలో శ్రీకాంత్ (63), సావిత్రి (53) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. శ్రీకాంత్ సహకార చక్కెర మిల్లులో డ్రైవర్ గా పని చేస్తున్నారు. తమ పిల్లలను చదివించేందుకు ఆయన అనేక చోట్ల అప్పులు చేశారు. ఆ విధంగానే పెద్ద కుమారుడు జగదీశ్ ను సీఏ చదివించాడు. ఇక కుమారుడిని ఉద్యోగంలో చేరమని చెప్పాలని అనుకున్నారు శ్రీకాంత్. కానీ 2013లో తన కారులో ప్రయాణించిన ఓ ఎన్నికల అధికారి యూపీఎస్సీ పరీక్షల గురించి చెప్పారు.
ఆ అధికారి మాటలు శ్రీకాంత్ ను బాగా ప్రభావితం చేశాయి. తన కుమారుడిని ఒప్పించి.. సివిల్స్ పరీక్ష రాయాలని తెలిపాడు. అప్పు చేసి తన కుమారుడిని కోచింగ్ పంపించాడు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూసి ఎదిగిన జగదీశ్.. తన తండ్రి కలను సాకారం చేశారు. అనేక కష్టాలను అధిగమించి జగదీశ్ UPPSC పరీక్షలో 440వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలోని విజయవాడలో ఐపీఎస్ ప్రొబేషన్ అధికారిగా ఆయన పనిచేస్తోన్నారు.
కొడుకు ఐపీఎస్ అయినప్పటికి తమలో మార్పు రాలేదని, తాము పేదరికం వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని, అదే పేదరికం తమను బలంగా మార్చిందని జగదీశ్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ రేకుల షెడ్డు తమ కుటుంబం ఆశలకు చిహ్నమని చెప్పారు. ఆదాయం పెరిగినంత మాత్రానికి తాము ఈ జీవనశైలిని వదిలిపెట్టమని తెలిపారు. ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజులు స్వయంగా పనిచేసుకుంటామని జగదీశ్ తండ్రి శ్రీకాంత్ గర్వంగా చెప్పారు. కుమారుడు ఉన్నత స్థాయిలో ఉన్న తమ గత జీవన విధానాన్ని మాత్రం వదలని ఈ తల్లిదండ్రులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.