సంక్రాతి సమయంలో ఏపీలో కోడి పందాలకు ఎంత క్రేజ్ ఉందో.. తమిళనాట జల్లికట్టుకు అంతే క్రేజ్ ఉంది. గతంలో సుప్రీం కోర్టు జల్లికట్టు నిర్వహణకు వ్యతిరేంగా తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంతకు ఈ జల్లికట్టు అంటే ఏంటి.. దాని చరిత్ర ఏంటో తెలియాలంటే.. ఇది చదవాలి.
జల్లికట్టు విజేతను పెళ్లాడేవారు
ఏటా సంక్రాతి సమయంలో కనుమ నాడు తమిళనాట జల్లికట్టును నిర్వహిస్తారు. క్రీ.పూ. 400-100 ఏళ్ల మధ్య కాలంలోనే జల్లికట్టు నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. ఈ క్రీడ నిర్వహించిన తొలి రోజుల్లో ఎద్దును లొంగదీసుకున్న ధైర్యవంతులైన యువకులను యువతులు తమ భర్తలుగా ఎన్నుకునేవారు. తర్వాతి కాలంలో యువకులు తమ ధైర్య సాహసాలను నిరూపించుకునే ఆటగా ఇది రూపాంతరం చెందింది. ఎద్దు మెడకు బంగారం లాంటి విలువైన పట్టీని కట్టేవారు. పరిగెడుతున్న ఎద్దును పట్టుకొని ఆ పట్టీని తీసుకున్నవారిని విజేతగా ప్రకటించేవారు. వారికి దాన్ని బహుమతి అందించేవారు.
ప్రస్తుత రోజుల్లో ఎద్దు మెడకు ఏ పట్టీ కట్టడం లేదు. పరిగెడుతున్న ఎద్దును లొంగదీసుకోవడానికే నేటి జల్లికట్టు పరిమితమైంది. ఇందులో ఎద్దు కాళ్ల కింద పడటం, దాన్ని లొంగదీసుకునే క్రమంలో కొమ్ములు శరీరంలోకి దిగడం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంది. భారీ జనం మధ్యలో వదలడం వల్ల ఎద్దు బెదిరే అవకాశం ఉంది గానీ.. దాని ప్రాణాలకు దాదాపుగా ఎలాంటి ముప్పు ఉండదు.
జనం మధ్యలోకి ఎద్దును వదలగా.. దాని కొమ్ములు లేదా తోకను పట్టుకొని.. చేతులతోనే నియంత్రించేందుకు చాలా మంది యువకులు ప్రయత్నిస్తారు. ఎద్దు మూపురాన్ని బలంగా పట్టుకొని లొంగదీసుకోవాలని చూస్తారు. జల్లికట్టు కోసం రైతులు ఎద్దులను ప్రత్యేకంగా సన్నద్ధం చేస్తారు. ఎద్దుల కాళ్లు బలాన్ని సంతరించుకోవడం కోసం వాటితో ఈత కొట్టిస్తారు. ఎద్దు బలంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
తాజాగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికి.. తమ సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు సీఎం స్టాలిన్ అనుమతి ఇచ్చారు. అయితే, ఈ పోటీలు చూసేందుకు తక్కువ సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలన్నారు. దక్షిణ తమిళనాడు ఇప్పటికే జల్లికట్టు పోటీలకు ముస్తాబవుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తమిళనాడులోని మధురై జిల్లాలో ఈనెల 14 నుండి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి.