ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది.. మనిషి చేయలేని పని లేదంటూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నేల,నింగి,సంద్రం అన్నింటా మనిషి తన వినూత్న ప్రయోగాలతో ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా ఢిల్లీలో ఒకే మొక్కకు వంకాయ, టమాటా కాసే కొత్త విధానాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని వారణాశి కూరగాయల పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది.
కొత్త మొక్కను 15 రోజుల నుంచి 18 రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. తొలి దశలో వంకాయ, టమాటా కొమ్మలు ఒకేలా పెరిగేలా చూసుకున్నారు. సేంద్రియ ఎరువుతోపాటు రసాయన ఎరువులు వాడారు. ఇలా అంటుకట్టిన కొత్తమొక్కల్లో 60 నుంచి 70 రోజుల తర్వాత వంకాయ, టమాటా కాయడం ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున 2.383 కిలోల టమాటాలు, 2.684 కిలోల వంకాయలు కాసినట్లు చెప్పారు. ఈ అద్భుత పరిశోధన రాబోయే రోజుల్లో రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని.. తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుకునేలా వీలు అవుతుందని ఐసీఏఆర్ పేర్కొంది.