యాపిల్ వంటి ఖరీదైన పండ్లతో పోటీపడుతుంది టమాటా. ఎర్రటి పండును కొనలేక, తినలేక పోతున్నారు సామాన్యుడు. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా టమాటా పచ్చడి, టమాటా కర్రీ, టమాటా రైస్/బిర్యానీ, కనీసం టమాటా రసం చేసుకుని, లాగించేసి కడుపు నింపుకునే
ధరలో యాపిల్ వంటి ఖరీదైన పండ్లతో పోటీపడుతుంది టమాటా. ఎర్రటి పండును కొనలేక, తినలేక పోతున్నారు సామాన్యుడు. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా టమాటా పచ్చడి, టమాటా కర్రీ, టమాటా రైస్/బిర్యానీ, కనీసం టమాటా రసం చేసుకుని, లాగించేసి కడుపు నింపుకునే కుటుంబాలు ఉన్నాయి. అలాంటిది టమాటా ధరలు పెరిగిన నాటి నుండి జిహ్వాకు సరైన రుచి తగలక ఏదో తినేశాం అంటే తినేశాం అని సరిపెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడు టమాటా ధరలు తగ్గుతాయి రా బాబు అని మాత్రం ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటించినా.. క్యూ లైన్లలో నిలబడ లేక, అంత రేటు పెట్టి తెచ్చినవి.. కొన్ని రోజులు కూడా నిల్వ ఉండకపోవడంతో వాటికి కేవలం చూస్తూనే బతికేస్తున్నారు సగటు జనం. అయితే ఈ టమాటాల కోసం ఇటీవల కాలంలో ఘోరాలు కూడా జరిగాయి.
కర్ణాటకలో టమాటా చేనులో దొంగలు పడి రూ.2 లక్షల విలువైన టమాటాను రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లిన సంగతి విదితమే. ఆ రైతులు లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా రైతు నారెం రాజశేఖర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. కొంత మంది రైతులపై దాడులు కూడా జరిగాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో మరో రైతుపై ఆగంతకులు దారిదోపిడీకి తెగబడ్డారు. లోక్ రాజ్ అనే రైతు పలమనేరు మార్కెట్‌లో టమాటాలు విక్రయించి.. స్వగ్రామమైన కొండ సముద్రం తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో నక్కబండ వద్ద కొందరు యువకులు అడ్డుకున్నారు. లోక్ రాజ్ పై బీరు బాటిళ్లతో దాడి చేసి, రూ. 4.5 లక్షలు తీసుకుని ఉడాయించారు. బీరు బాటిళ్లతో తలపై దాడి చేయడంతో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.