మన దేశంలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు హరిహరసుతుని నామ స్మరణతో మారుమోగుతాయి. కార్తీక మాసంలో ప్రజలు ఎక్కువగా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు సాగే ఈ దీక్షలో మాల ధరించిన వ్యక్తులు అత్యంత కఠిన నియమాలను పాటిస్తూ.. దీక్ష పూర్తి చేస్తారు. 41 రోజులు గడిచిన తర్వాత ఇరుముడి కట్టుకుని.. కేరళ శబరిమలలో ఉన్న అయ్యప్ప సన్నిధికి చేరుకుని.. ఇరుముడి సమర్పించి.. దీక్షను ముగిస్తారు. అయితే చాలా మంది మకర సంక్రాతి నాడు దీక్ష విరమింపజేస్తారు. ఇందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది.
మకర సంక్రాంతి రోజున అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి రూపంలో దర్శనిమిస్తారని బలంగా విశ్వసిస్తారు. ఆ రోజు శబరిమలలో ఉండి.. జ్యోతి దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తారు. అయితే ఈ మకర జ్యోతి దర్శనంపై ప్రతి ఏటా అనేక వివాదాలు తెర మీదకు వస్తాయి. భక్తులు దీన్ని అయ్యప్ప మహిమగా విశ్వసిస్తుండగా.. నాస్తికులు మాత్రం.. ఇది అంతా అబద్దం అని వాదిస్తారు. ఈ నేపథ్యంలో మకరజ్యోతికి సంబంధించి అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం కేరళ పశ్చిమ పర్వత ప్రాంతంలో నెలకొని ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనమ్ అంటారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు, కొండలతో నిండి ఉంటుంది. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్టించినట్లు చెబుతారు.
మకర సంక్రాతి రోజున సాయంత్రం చీకటి పడే వేళ శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా.. కంఠమల పర్వతాలలో మిణుకుమిణుకుమంటూ ఓ వెలుగు మూడు సార్లు.. కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వెలుగునే మకర జ్యోతి అంటారు. ఆ పర్వతాలలో దేవతలు, రుషులు ఇచ్చే హారతే ఇలా మకరజ్యోతి రూపంలో దర్శనమిస్తుందని భక్తులు నమ్ముతారు.
మకరజ్యోతి వేరు.. మకర విలక్కు వేరు..
మకర జ్యోతి అనేది ఒక నక్షత్రం. ఇది జనవరి 14వ తేదీన ఆకాశంలో కనిపిస్తుంది. అయితే మకర విలక్కు అనేది ఒక వెలుగు. ఇది కంఠమల పర్వతాలపైన కనిపిస్తుంది. అయితే చాలా మంది మకర విలక్కను చూసి మకర జ్యోతి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రెండు వేర్వేరు. అలాగే ఇంకా కొందరు మకర జ్యోతి గురించి పురాణాల్లో ఎక్కడ ప్రస్తావన లేదని కొందరు చెబుతున్నారు. చరిత్రలో ఎక్కడా గానీ మకర జ్యోతి ప్రస్తావన అనేదే లేదని చెబుతున్నారు.
మకరజ్యోతి గురించి మరో కథ..
ఇప్పుడు కనిపించే మకరజ్యోతి పొన్నాంబల్ మేడు పర్వతంలో ఒకప్పుడు గిరిజనులు నివాసముండే వారట. ఓ రోజు వారంతా సాయంత్రం చీకటి పడగానే చలికి తట్టుకోలేక పుల్లలు, కట్టెలు వేసి చలిమంటను వేసుకున్నారట. అయితే ఆరోజు సరిగ్గా మకర సంక్రాంతి. అది కాస్త అయ్యప్ప కొండ మీద ఉన్న భక్తులకు ఆ వెలుగు దూరం నుండి ఒక జ్యోతిలాగా కనిపించిందట. ఇదంతా యాదృచ్చికమే అయినా అక్కడి వారు ఇదంతా స్వామి వారి మహిమ అని నమ్మారట. అప్పటి నుండి దానిని మకరజ్యోతిగా పేర్కొనడం జరిగిందని ఓ కథ ఉంది. ఆ తర్వాత అక్కడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు రావడంతో అక్కడి గిరిజనులు కొండపై నివాసాన్ని వదిలి వెళ్లిపోయారట.
హేతువాదులు ఏమంటున్నారంటే..
కొందరు హేతువాదులు ఇందుకు సంబంధించి కొన్ని వాదనలు చేస్తున్నారు. పొన్నంబల ప్రాంతంలో ఓ టవర్ లోకి ఎక్కి కర్పూరాన్ని పెద్ద మొత్తంలో వెలిగించి పట్టుకుంటున్నారు. ఇది శబరిమల నుండి చూసే భక్తులకు ఇది మకరంలా కనబడుతుందని వారు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.