హరియాణాకు చెందిన ఒక ముర్రాజాతి దున్నపోతు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. దీని ముందు లగ్జరీ కార్ల విలువ కూడా దిగదుడుపు అనే చెప్పాలి.
ఉద్యోగాలు, వ్యాపారాల మోజులో చాలా మంది వ్యవసాయాన్ని, పశుపోషణను దూరం పెట్టారు. కానీ చక్కగా ప్లాన్ చేసుకుంటే వీటిల్లో కూడా లక్షల రూపాయాలను ఆర్జించొచ్చు. నేలను నమ్ముకున్నోడు బాగుపడొచ్చని ఎందరో నిరూపించారు. ఈమధ్య లక్షల రూపాయల శాలరీని వదులుకుని కూడా పశుపోషణ వైపు మళ్లుతున్న టెకీలను చూస్తున్నాం. అంతేగాక వారు సక్సెస్ కూడా అవుతున్నారు. పశుపోషణ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉత్తరాది రాష్ట్రాలే. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్, హరియాణా లాంటి రాష్ట్రాలను ఉదాహరణగా చెబుతుంటారు. అలాంటి హరియాణా రాష్ట్రానికి చెందిన ఒక దున్నపోతు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హరియాణాకు చెందిన ముర్రాజాతి దున్నపోతు ‘షెహన్షా’ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.
పానీపట్ జిల్లా, దిడ్వాడీ గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్ అనే రైతు పెంచుకుంటున్న ఈ దున్న విలువ ముందు లగ్జరీ కార్లు కూడా పనికిరావు. ఈ దున్న ధర అక్షరాలా రూ.25 కోట్లు అంటే నమ్మండి. షెహన్షా వయసు పదేళ్లు. పొడవు 5 అడుగులు, ఎత్తు ఆరడుగులు. ఈ ముర్రాజాతి దున్నలను హరియాణాలో నల్ల బంగారం అని పిలుస్తారు. వీటి వీర్యానికి మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ప్రతి నెలలో నాలుగుసార్లు మాత్రమే షెహన్షా వీర్యాన్ని బయటకు తీస్తారు. దీన్ని మార్కెట్లో విక్రయించి నెలకు రూ.9.60 లక్షలు ఆర్జిస్తున్నారు నరేంద్ర సింగ్. దీని కోసం ఒక ప్రత్యేక స్విమ్మింగ్ పూల్‌ను కూడా కట్టించారాయన. పలు పోటీల్లో విజేతగా నిలిచిన షెహెన్ షా.. ఒక ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా రూ.30 లక్షలు గెలుచుకుంది.