ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం రూపొందించిన చట్టంపై పంజాబ్, హరియాణా హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై హరియాణా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అలానే హైకోర్టు ఉత్తర్వులను తన రికార్డులో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను జాబితా చేయడానికి బెంచ్ అంగీకరించింది.
కేవలం ఒకటిన్నర నిమిషాల విచారణతో హైకోర్టు తన నిర్ణయాన్ని ఆమోదించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో తెలిపింది. హైకోర్టులో రాష్ట్రం తరఫున న్యాయవాది వాదనలు వినిపించలేకపోయారని సుప్రీంకోర్టుకు తెలిపింది. హరియాణాలోని నివాసితులకు ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే హరియాణా ప్రభుత్వ చట్టంపై రాష్ట్ర హైకోర్టు గురువారం మధ్యంతర స్టే ఇచ్చింది. ఈ నిర్ణయం నిలకడలేనిదని, సహజ న్యాయానికి విరుద్ధమని పేర్కొంటూ హరియాణా ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.
హరియాణా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ అభ్యర్థుల చట్టం, 2020, గత ఏడాది నవంబర్‌లో ఆమోదం పొందింది. ఈ ఏడాది జనవరి 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. గరిష్టంగా నెలవారీ జీతం రూ. 30,000 వేతనం అందించే ఉద్యోగాలకు ఈ చట్టం వర్తిస్తుంది. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా వేలాది మంది యువతకు కొత్త ఉపాధి మార్గాలను కల్పిస్తామని తెలిపారు. మార్చి 2021లో, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు, 2020కి తన ఆమోదం తెలిపారు.