దేశంలో ఇప్పటి వరకు ఎన్నో బాంబు పేలుళ్లు సంభవించాయి. తాజాగా గుజరాత్ అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 38 మందికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది. 2008లో 18 చోట్ల వరుసబాంబు పేలుళ్లు జరిపారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. దోషులకు కఠిన శిక్ష విధించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
13ఏళ్ల పాటు విచారణ సాగిన ఈ కేసులో 49మంది దోషుల్లో 38మందికి మరణశిక్షని విధించింది కోర్టు. మరో 11మందికి జీవిత ఖైదుని విధించింది. ఇంతమందికి ఒకేసారి ఉరిశిక్ష విధించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. 2008లో అహ్మదాబాద్ సిటీలో దుండగులు స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బస్ స్టేషన్లను ఇలా 18 చోట్లు టార్గెట్ గా చేసుకుని బాంబులు అమర్చారు. కొన్ని చోట్ల అమర్చిన బాంబులు పేలేలోపే బాంబ్ స్క్వాడ్ అధికారులు నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో 56 మంది మృతి చెందారు, మరో 200 మందికి గాయాలయ్యాయి.
ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అహ్మదాబాద్ వరుస పేలుళ్లపై దర్యాప్తు జరిపిన గుజరాత్ పోలీసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇందులో చాలా మందికి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఆధారంగా కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికీ కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. కేసుకు సంబంధించి అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిపై కోర్టు విచారణ జరిపింది. మొదట మొత్తం 78 మందిని నిందితులుగా నిర్ధారించింది. అనంతరం వారిలో ఒకరు అప్రూవర్‌గా మారిపోవడంతో నిందితుల సంఖ్య 77కు తగ్గింది. మొత్తం 13 ఏళ్ల పాటు జరిగిన ఈ విచారణలో 1,100 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు 49 మందిని దోషులుగా తేల్చింది. 2008 నుంచి సుధీర్ఘ విచారణ అనంతరం ఈరోజు ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.
2008 Ahmedabad serial bomb blast case | A special court will pronounce the quantum of sentence against 49 convicts today pic.twitter.com/iz279NqwYF
— ANI (@ANI) February 18, 2022