కన్నతండ్రి చేతులు జోడించి బతిమాలినా ఓ కూతురు వినలేదు. ఆఖరికి తండ్రి కాళ్లు పట్టుకొని గుండెలవిసేలా ఏడ్చినా ఆమె కనికరించలేదు.
పేరెంటింగ్ అంటే మాటలు కాదు. పిల్లల్ని కని, పెంచి, వృద్ధిలోకి తీసుకురావడం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుంది. పిల్లల కోసం వాళ్లు చేసే త్యాగాలు, పడే కష్టం అంతా ఇంతా కాదు. పిల్లలు పుట్టేంత వరకు ఆలుమగలది ఒకరకమైన జీవితం.. ఆ తర్వాత మరో రకమైన జీవితం అని చెప్పొచ్చు. పిల్లలు పుట్టాక పేరెంట్స్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. తల్లిదండ్రులు ఇక ఏం చేసినా వారి కోసమే అన్నట్లుగా ఉంటుంది. తమ సంతోషాల కంటే పిల్లల ఆనందమే ముఖ్యమని భావిస్తుంటారు. వారికి ఏది కొనిచ్చినా తెగ సంతోషపడతారు. వారి కళ్లలో నుంచి చిన్న కన్నీటి బొట్టు వచ్చినా తట్టుకోలేరు. పిల్లలకు జన్మను ఇవ్వడమే గాక, వారి కోసం తమ లైఫ్‌ను త్యాగం చేసే పేరెంట్స్‌కు ఏమి ఇచ్చినా రుణం తీరదు.
పేరెంట్స్ రుణం తీర్చుకోకపోయినా ఫర్వాలేదు.. కానీ వారికి శోకాన్ని మిగల్చొద్దని పెద్దలు అంటుంటారు. అయితే కొంతమంది పిల్లలు తమ జీవితానికి సంబంధించి తీసుకునే పలు నిర్ణయాలు పేరెంట్స్‌కు శరాఘాతంలా మారతాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక కూతురు.. తన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో చోటుచేసుకుంది. బనస్కాంతకు చెందిన ఓ యువతి కొన్ని రోజుల కింద తన ప్రియుడితో కలసి పారిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో పోలీసులు ఆమెను వెతికి పేరెంట్స్ ముందుంచారు. అయితే ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా.. కాళ్లు పట్టుకొని గుండెలవిసేలా ఏడ్చినా కనికరించలేదు. తన భర్తతో కలసి ఉంటానని ఆమె వెళ్లిపోయింది. కూతురి కాళ్లు పట్టుకొని తండ్రి ఏడుస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.