భార్యభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే కొందరు మాత్రం పంతాలకు పోయి విడిపోయేందుకు సిద్ధపడుతుంటారు. ఈ క్రమంలో దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. అలాంటివారి విషయంలో తాజాగా కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇతర మహిళలతో భార్యను పోల్చడం, అందం విషయంలో తన అంచనాలను అందుకోలేకపోయావని.. భర్త వెక్కిరించడం క్రూరత్వమే అవుతుందని కోర్టు తెలిపింది. ఈ కారణంతో విడాకులు మంజూరు చేయడం సబబేనని కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే..
కేరళకు చెందిన ఓ మహిళ.. తన భర్త క్రూరంగా వ్యవహరిస్తున్నాడని, సూటిపోటీ మాటలతో మానసికంగా వేధనకు గురిచేస్తున్నాడని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో వాదోపవాదనలు విన్న కోర్టు.. వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ తీర్పును సదరు మహిళ భర్త హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్ స్వీకరించిన కేరళ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అందం విషయంలో అంచనాలు తారుమారయ్యాయని, అనుకున్నంత అందంగా లేవని, సోదరుడి భార్య సహా మరికొందరు మహిళలతో తన భర్త పోల్చుతుండటంతో తాను తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నానని బాధితురాలు కోర్టుకు తెలిపింది.
జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ సీఎస్ సుధలతో కూడి ద్విసభ్య ధర్మాసనం ఇరువైపు వాదనలు పరిశీలించింది. పిటిషనర్ తన అంచనాలకు అనుగుణంగా భార్య లేదని భర్త నిరంతరం పదేపదే తిట్టడం.. ఇతర మహిళలతో పోల్చడం మొదలైనవి ఖచ్చితంగా మానసిక క్రూరత్వం కిందకు వస్తాయి.. దానిని భార్య భరించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ఇది విడాకులకు సరైన కారణం కాకపోయినప్పటికీ వారి వైవాహిక బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్న అయిందని కోర్టు అభిప్రాయపడింది.
వివాహ బంధాన్ని సాధ్యమైనంత వరకు కొనసాగించాలని పరిగణలో ఉన్నప్పటికి.. భాగస్వామి మానసికంగా దెబ్బతింటే వాస్తవాన్ని గుర్తించాలని పేర్కొంటూ విడాకులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.ఆగస్టు 4న కేరళ హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తీర్పు ఇచ్చింది. మరి.. కేరళ కోర్టు చేసిన పై వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.