మనిషి తల్చుకుంటే చేయలేని పని ఏదీ ఉండదని అంటారు. టెక్నాలజీ సహాయంతో మనిషి తనకు కావాల్సిన ఎన్నో సదుపాయాలు సమకూర్చుకుంటున్నాడు. మనుషుల సహాయం లేకుండా కేవలం మిషిన్ల సహాయంతో ఎన్నో పనులు జరుగుతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీతో రక రకాల వస్తువులు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ మద్య మనుషులు చేసే పనులు సగం రోబోలు చేస్తున్నాయి. గోవాకు చెందిన ఒక దినసరి కూలీ తన కూతురు కోసం ఓ అద్భుతాన్ని సృష్టించాడు. తాను ఏమీ చదువుకోలేదు.. టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు.. తనకు తెలిసింది ఒక్కటే తన దివ్యాంగురాలైన కూతురికి ఏదైనా చేయాలన్న తపన.. పట్టుదల ఒక రోబోని కనిపెట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
గోవాకు చెందిన బిపిన్ కదమ్ కి భార్య, కూతురు ఉన్నారు. ప్రస్తుతం కూతురు వయసు పద్నాలు సంవత్సాలు.. ఆమె అంగవైకల్యంతో బాధపడుతుంది. అంతే కాదు ఎవరైని తినిపిస్తేనే తినే పరిస్థితి. ఇటీవల బిపిన్ భార్య తీవ్ర అనారోగ్యానికి గురై మంచాన పడింది. అప్పటి నుంచి ఆయనకు కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. దగ్గరలో కూలీ పనులు చేస్తూ మద్యలో ఇంటికి వచ్చి తన కూతురుకి ఏదైనా తినిపించి వెళ్లేవాడు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడేవాడు. తమ కోసం కష్టపడుతున్న బిపిన్ ని చూసి భార్య పాపకు తినిపించడానికి ఏదైనా మార్గం చూడమని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే బిపిన్ తన పాప కోసం ఏదైనా ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు.
తన పాపకు ఎవరి సహాయం లేకుండా ఒక రోబో తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. టెక్నాలజీ గురించి తనకు ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయిన ఒక రోబోని తయారు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన పనులు పూర్తి చేసుకున్న తర్వాత మిగతా సమయం మొత్తం రోబోలకు సంబంధించిన సాఫ్ట్ వేర్ పై అవగాహన పెంచుకున్నాడు. ఇలా గంటలు, రోజుల కొద్ది కష్టపడుతూ కొన్ని నెలల్లో ఒక అద్భుతం సృష్టించాడు. తన కూతురి కోసం రోబోని తయారు చేశాడు. దీనికి మా రోబో అని పేరు పెట్టాడు.
బిపిన్ తయారు చేసిన రోబో కి పూర్తిగా వాయిస్ కమాండింగ్ ఏర్పాటు చేశాడు. కూతురు వాయిస్ వినపడగానే రోబో దగ్గరకు వచ్చి ప్లేట్ లో భోజనం ఏర్పాటు చేస్తుంది.. పాప వాయిస్ కమాండింగ్ తో ఏ కూర కలపాలో కలిపి నెమ్మదిగా తినిపిస్తుంది. ప్రస్తుతం తాను చేసిన మా రోబో తో తన భార్య, కూతురు చాలా ఆనందంగా ఉన్నారని బిపిన్ తెలిపారు. అయితే బిపిన్ చేసిన ఈ అద్భతం గోవా ప్రభుత్వ దృష్టికి రావడంతో అతన్ని ప్రశంసించింది.
‘మా రోబో’ మరింత టెక్నాలజీతో అభివృద్ది చేసేందుకు.. వాణిజ్యపరంగా ఉపయోగ పడేందుకు ఆర్థిక సహాయం కూడా అందించనుంది. ఏది ఏమైనా మనిషి తలుచుకుంటే సాధించలేదని ఏదీ ఉండదని ఒక దినసరి కూలీ నిరూపించాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.