ప్రపంచం మొత్తం ఉగ్రవాదం అనేది చాలా పెద్ద సమస్య. ఇది క్యాన్సర్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తూనే ఉంది. వారిని ఎంత అణచివేసినా ఏదో రకంగా సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. గతేడాది కోయంబత్తూరు, మంగళూరులో జరిగిన పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
గతేడాది కోయంబత్తూరు, మంగుళూరులో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. అవి జరిగిన నెలల తర్వాత వాటి వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రచార మ్యాగ్జిన్ అయిన ‘వాయిస్ ఆఫ్ ఖురాసన్’ ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఇన్ కొరాసన్ ప్రావిన్స్(ISKP) ఈ విషయాన్ని వెల్లడించింది. వాయిస్ ఆఫ్ ఖురాసన్ అనేది ఐఎస్కేపీ వాళ్ల కరపత్రం లాంటింది. వారి దురాఘతాలను ప్రచారం చేసుకోవడానికి, వారి అనుచరులు, సానుభూతి పరులను రెచ్చగొట్టడానికి దీనిని వాడుతుంటారు. సెంట్రల్, దక్షిణ ఆసియాలో ఈ మ్యాగజైన్ సర్క్యూలేట్ అవుతుంటుంది. దీనిని అల్ అజీమ్ ఫౌండేషన్ ద్వారా నడిపిస్తుంటారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాలు ప్రచారం చేసేందుకు ఐఎస్కేపీకి ఉన్న ప్రధాన ఆయుధంమే ఈ వాయిస్ ఆఫ్ ఖురాసన్.
తాజాగా ఈ మ్యాగజీన్ నుంచి 68 పేజీలతో 23వ సంచిక వెలువడింది. ఈ మ్యాగజీన్ ద్వారా సౌత్ ఇండియాలో వారి ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని ప్రకటించారు. అయితే సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో వారి సభ్యులు ఉన్నారు అనే విషయాలను మాత్రం వారు వెల్లడించలేదు. కానీ, నిపుణుల అంచనా ప్రకారం ఆ ముజాహిదిన్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉండి ఉండచ్చని చెబుతున్నారు. కోయంబత్తూరులో అక్టోబర్ 23న ఆటోలో ప్రెజర్ కుక్కర్ బ్లాస్ట్, నవంబర్ 19న జరిగిన మంగుళూరు పేలుడు ఐసిస్ ప్రోత్సాహంతోనే జరిగినట్లు ప్రకటించుకున్నారు.
కాకపోతే ఆ సంచిక ఎడిటర్ మంగుళూరును బెంగళూరుగా ముద్రించాడు. “కోయంబత్తూరు, బెంగళూరులో జరిగిన పేలుళ్లను మీరు గమనించలేదా. మన సోదరులు అల్లాని నమ్మని వారిపై పగ తీర్చుకున్నారు” అంటూ తెలిపారు. ఈ కేసులను ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 ప్రాంతాల్లో ఉగ్రవాద సానుభూతి పరుల కోసం సోదాలు జరిగాయి. ఈ సోదాలు జరిగిన సరిగ్గా రెండు వారాల తర్వాత వాయిస్ ఆఫ్ ఖురాసన్ ద్వారా ఆ పేలుళ్లకు సంబందించి ఇప్పుడు ప్రకటన చేశారు. భారతదేశానికి సంబంధించి ఆ మ్యాగజీన్ లో ఆర్టికల్ ఉంది. అందులో హిందువులను అల్లాకి శత్రువులుగా అభివర్ణించారు. వారిపై పగ తీర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. కశ్మీర్ ని హస్తగతం చేసుకోవాలి అన్నట్లు చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ పై కూడా వారి సంచికలో కథనం ముద్రించారు. షహబాజ్ షరీఫ్ దేశం ఇస్లామిక్ లో ఒక క్యాన్సర్ సెల్ వంటిదని అభివర్ణించారు.