రేషన్ కార్డు ఉంటే నిత్యావసర సరుకులను సబ్సిడీగా పొందవచ్చు. అయితే నకిలీ రేషన్ కార్డులను ఏరివేసే ప్రక్రియను చేపట్టిన కేంద్రం తాజాగా రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త చెప్పింది.
రేషన్ కార్డును ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేయమని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతుంది. మార్చి 31 లోపు లింక్ చేసుకోకపోతే రేషన్ కార్డు వినియోగదారులు ప్రయోజనాలు కోల్పోతారని కూడా చెప్పింది. ఈ క్రమంలో ఆధార్ తో రేషన్ కార్డును లింక్ చేసేందుకు జనాలు రేషన్ కార్యాలయాల వద్ద క్యూలు కడుతున్నారు. రోజురోజుకు లింక్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండడంతో 31 లోపు అనుసంధానం చేసుకోవడానికి సమయం సరిపోతుందా? లేదా? అని ప్రజలు కంగారుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డును, ఆధార్ తో లింక్ చేసే గడువు తేదీని జూన్ 30కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆధార్ తో రేషన్ కార్డును అనుసంధానం చేసే గడువు తేదీని మార్చి 31 నుంచి జూన్ 30కి పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యావసర సరుకులను రేషన్ కార్డు ద్వారా సబ్సిడీగా పొందే అవకాశం రేషన్ కార్డు కల్పిస్తుంది. అయితే ఈ రేషన్ కార్డు వినియోగదారుల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుకు ఆధార్ కార్డుని జత చేయడం ద్వారా నకిలీ రేషన్ కార్డులను ఏరివేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఖచ్చితంగా రేషన్ కార్డుకు ఆధార్ జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నా, ఎక్కువ ఆదాయం ఆర్జిస్తూ రేషన్ కార్డు వాడుతున్నా రేషన్ కార్డులను రద్దు చేయనుంది ప్రభుత్వం. అందుకే గడువు తేదీలోపు ఆధార్ ను అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది.