మనిషికి డబ్బు అవసరం మాత్రమే, జీవితం కాదని చెప్పి చాలా మంది చెబుతుంటారు. కానీ దాన్ని ఆచరణలో కొందరే పెడతారు. అలాంటి వారిలో బిలియనీర్లు కూడా ఉంటారు. ఏంటి డబ్బే జీవితంగా బతికే బిలియనీర్లు.. డబ్బు అవసరం మాత్రమే అన్నట్టు బతుకుతారా? అని సందేహం కలుగుతుందా? అయితే మీరు ఈ వ్యక్తి కథ చదవాల్సిందే.
డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. రూపాయి మీద ప్రీతి మనుషులకి. వంద, వెయ్యి రూపాయలనే వదులుకోవాలంటే మనసొప్పదు. అలాంటిది వందల, వేల కోట్ల ఆస్తులను వదులుకోవడానికి మనసొప్పుతుందా? విలాసవంతమైన సౌకర్యాల మధ్య రాజులా బతుకుతూ, కోట్ల సంపదలో మునిగి తేలుతూ ఉంటే ఈ ఆస్తులు నాకెందుకు అన్న ఆలోచన వస్తుందా? ఇంకా ఆ సంపదతో మరింత సంపదను సృష్టించుకుని తరతరాలకు సరిపడగా పోగేయాలని అనుకుంటారు. కానీ కొంతమందికి వేల కోట్ల సంపదలో మునిగితేలడం అంటే బురదలో మునగడం లాంటిది. అందుకే వేల కోట్లను కాదని సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటారు. ఇలాంటి వారిని సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లోనూ చూస్తాం.
ఇటీవలే 40 వేల కోట్లకు వారసుడైన ఓ బిలియనీర్ ఆస్తిని, అంతస్తులను వదిలేసి అడవుల బాట పట్టి భిక్షాటన చేసుకుంటూ బతకడం ప్రారంభించారు. తాజాగా ఈయనలానే మరో బిలియనీర్ వందల కోట్ల ఆస్తులను కాదని సన్యాసం తీసుకున్నారు. ఆయన మరెవరో కాదు. భన్వర్ లాల్ రఘునాథ్ దోషి. రాజస్థాన్ లో చిన్న వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రి వద్ద రూ. 30 వేలు తీసుకుని ప్లాస్టిక్ వ్యాపారాన్ని ప్రారంభించారు. రూ. 30 వేలతో మొదలై రూ. 600 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది. ఢిల్లీ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఆస్తులన్నీ వదిలేసి జైనమతాన్ని స్వీకరించి మత బోధకుడిగా మారారు. అహ్మదాబాద్ లో లక్షలాది మంది ప్రజల సమక్షంలో జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురేష్ స్వరాజ్ జీ మహారాజ్ శిష్యుడిగా చేరారు.
ఈ వేడుకకు హాజరైన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భన్వర్ లాల్ ని సత్కరించారు. అయితే ఇలా సన్యాసం తీసుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదంట. ఈ కోరిక ఎప్పటి నుంచో ఉందంట. అయితే అప్పటి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోక ఒక గాడిన పెట్టిన తర్వాత తన లక్ష్యాన్ని చేరాలని అనుకున్నారట. ఇక తాను అనుకున్నవి సాధించిన ఆయన ఇక సాధించవలసింది ఏదీ లేదని జైన మతాన్ని స్వీకరించారు. డబ్బు సంపాదించాలి అని పరుగులు పెట్టే మనుషులున్న ఈరోజుల్లో.. వందల కోట్ల ఆస్తిని కాదని ఇలా సన్యాసం తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే. మరి 600 కోట్ల ఆస్తిని కాదని సన్యాసిగా మారిన ఈ బిలియనీర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.