నగలు, డబ్బు, వాహనాలు, ఆఖరికి తినే పదార్థాలు కూడా దొంగతనం చేసే వారి గురించి విన్నాం. కొన్ని రోజులు క్రితం హైదరాబాద్‌లో పబ్లిక్ టాయిలెట్‌ను కూడా ఎత్తుకెళ్లిన చోర శిఖామణుల గురించి చదివాం. కానీ ఇప్పుడు చదవబోయే దొంగతనం వార్త.. వేరే లెవెల్. ఇక్కడ దొంగలు ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు. ఆ వివరాలు..
ఈ వింత దొంగతనం బిహార్‌లో చోటు చేసుకుంది. రోహ్‌తాస్ జిల్లాలోని నస్రీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమియావర్ గ్రామంలో ఈ చోరీ చోటు చేసుకుంది. వంతెనను దొంగిలించిన తీరు చూసి.. పోలీసులే ఖంగు తిన్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమియావర్ గ్రామంలోని అరా కాల్వలపై 1972లో ఇనుప వంతెనను నిర్మించారు. ప్రస్తుతం అతి శిథిలావస్థలో ఉంది. దీన్ని తొలగించాల్సిందిగా ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నా లాభం లేకపోయిది. బ్రిడ్జి వాడుకలో లేదు. అది కూడా ఐరన్ బ్రిడ్జి కావడంతో దీని మీద కొంత మంది దొంగల కన్ను పడింది. మార్కెట్‌లో ఇనుముకు మంచి ధర ఉండడంతో దానిని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నారు. కొంత మందిదొంగలు.. ఏకంగా నీటి పారుదలశాఖ అధికారుల రూపంలో గ్రామానికి వెళ్లారు. ఇక్కడ కొత్త బ్రిడ్జి రాబోతోందని.. పాడైపోయిన ఈ బ్రిడ్జిని తొలగిస్తున్నామని చెప్పారు. స్థానిక గ్రామ పంచాయతీ అనుమతి కూడా తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: పబ్లిక్ టాయిలెట్ చోరీ.. GHMC ఉద్యోగి హస్తం!
ఆ తర్వాత జేసీబీ, పికప్ వ్యాన్, గ్యాస్ కట్టర్ వంటివి తీసుకొచ్చి.. బ్రిడ్జి తరలింపును ప్రారంభించారు. గ్యాస్ కట్టర్‌ల సాయంతో ఇనుప వంతెనను ముక్కలు ముక్కలుగా కోశారు. వాటిని జేసీబీల సాయంతో.. ట్రక్కుల్లోకి ఎక్కించి తీసుకెళ్లారు. మూడు రోజుల్లోనే బ్రిడ్జిని మాయం చేశారు. ఐతే మూడు రోజులుగా దొంగలు బ్రిడ్జిని తరలిస్తున్నా ఉన్నతాధికారుల దృష్టికి మాత్రం ఈ సమాచారం వెళ్లలేదు. దొంగలు బ్రిడ్జీని పూర్తిగా తరలించిన తర్వాత.. ఈ విషయం అధికారుల దృష్టికి చేరింది. అంతేకాక.. వచ్చింది నీటి పారుదల శాఖ అధికారులు కాదని.. దొంగలని తెలియడంతో.. అందరూ నోరెళ్లబెట్టారు. ఈ వంతెన చాలాకాలంగా వినియోగంలో లేదు. మొత్తం 20 టన్నుల బ్రిడ్జిని ముక్కలు ముక్కలుగా చేసి.. తీసుకెళ్లారని స్థానికులు చెప్పారు. ఇలా అందరినీ బురిడీ కొట్టించి.. పట్ట పగలే బ్రిడ్జిని చోరీ చేయడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: 15 కేజీల బంగారం చోరీ.. ఎక్కడ దాచారో తెలిస్తే మైండ్ బ్లాంక్
ఈ ఘటనపై నీటిపారుదల శాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజినీర్ అర్షద్ కమల్ షమ్సీ మాట్లాడుతూ.. వంతెన శిథిలావస్థలో ఉందని చెప్పారు. చాలా ఏళ్లుగా కొంత మంది వ్యక్తులు కొంచెం కొంచెంగా ఇనుమును కాజేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిని తొలగించాల్సి ఉందని.. అంతలోనే ఇలా చోరీకి గురయిందని చెప్పారు. ఈ వ్యవహారంపై నస్రీగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఇది కూడా చదవండి: పట్టపగలే.. బస్తా నిండా నగలు.. 7 నిమిషాల్లో కోటిన్నర దోచేశారు!