మతి స్థిమితం లేని మహిళపై విచక్షణారహితంగా దాడి చేసినందుకు గాను బెంగళూరు ట్రాఫిక్ పోలీసు ఏఎస్‌ఐ ఆర్ నారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. సదరు ట్రాఫిక్ ఏఎస్‌ఐ మహిళపై దాడి చేసిన వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ట్రాఫిక్ అధికారిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో స్పందించిన హోం మంత్రి ఏఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంతకు విషయం ఏంటంటే.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఏఎస్‌ఐ నారాయణ్ టోయింగ్ వాహనంలో ఉండగా మతిస్థిమితం లేకుండా రోడ్డుపై అనాథగా తిరుగుతున్న మంజుల అనే మహిళ అతడిపై రాయి విసిరింది. అది తగిలి ఏఎస్‌ఐకి ముఖం మీద రక్తం కారింది. వెంటనే వాహనం నుంచి దిగిన ఏఎస్‌ఐ ఆ మహిళను అసభ్యంగా దూషిస్తూ ఇష్టానుసారం కొట్టాడు.
కొట్టొద్దు అని ఆమె అతని కాళ్లపై పడితే బూటుకాళ్లతో తన్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణమంతా కొందరు వీడియోలు తీయడంతో అవి సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో వైరల్ అయ్యింది. ఎందుకనో ఆ మహిళకు టోయింగ్ చేయడం కనబడితే సహించలేకపోతున్నట్లు తెలిసింది. ఎక్కడైనా టోయింగ్ చేస్తుంటే అడ్డుకునేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఎస్‌జే.పార్కు పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.
#Bengaluru ; A differently abled woman objecting to her vehicle being towed by cops and got assaulted.
Cops allege she had thrown stone injuring R Narayana,Assistant Sub Inspector of Gate traffic police,narrowly missing injuring his eye.Cop lost his cool & thrashed the woman. pic.twitter.com/kSvyM4FtHS
— Hate watch Karnataka (@Hatewatchkarnat) January 29, 2022
ఏఎస్‌ఐ మహిళపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో.. దీనిపై పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలో ట్రాఫిక్ ఏఎస్‌ఐ దౌర్జన్యంపై హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణకు ఆదేశించారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, దీనికి పోలీసులు మినహాయింపు కాదన్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
పోలీసులూ హద్దులు దాటొద్దు: సీఎం
టోయింగ్ వ్యవస్థను పునర్ పరిశీలిస్తామని, కాపాడాల్సిన వారే హద్దులు దాటి ప్రవర్తిస్తే తాను సహించనని సీఎం బసవరాజ బొమ్మై హెచ్చరించారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విధానసౌధ ఆవరణలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. ట్రాఫిక్ ఏఎస్‌ఐ ఉదంతాన్ని గమనించానని, ప్రజలతో చట్టబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థపై సోమవారం డీజీపీ, పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశమై ప్రజలతో సత్సంబంధాలతో ప్రవర్తించేలా తీర్మానాలు చేస్తానన్నారు.