కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఏం చేసినా దానిని అడ్డుకోవాలంటే రెండే మార్గాలు.. ఒకటి వ్యక్తిగత జాగ్రత్త, రెండు కరోనా టీకా తీసుకోవడం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, ప్రణాళికలతో టీకాల పంపిణీ బాగానే జరుగుతోంది. అయితే టీకాలు ఎందుకు, ఆల్కహాలిక్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ ఎందుకు అంటూ ప్రశ్నిస్తుంటారు. మేం వేసుకునే ఆల్కహాల్ చాలదా ఆ కరోనా చావడానికి అనే మహానుభావులు కూడా లేకపోలేదు. అలాంటి వారికి చెక్‌పెడుతూ రెండు డోసుల టీకా తీసుకున్నవారికే మద్యం అమ్మకం అంటూ నిర్ణయం తీసుకున్నారు సర్కారోళ్లు. అనుకున్నదే తడవుగా ఆచరణలో కూడా పెట్టేశారు. కంగారు పడకండి.. ఆ నిర్ణయం తీసుకుంది తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. కాస్త స్తిమిత పడండి.
ఈ సంచలన నిర్ణయం తీసుకుంది ఎక్కడో కాదు తమిళనాడులో. నీలగిరి జిల్లాలో అప్పుడే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు కూడా. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణంయ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నేను తెలీదా, రోజూ వస్తున్నా కదా, రెగ్యులర్ కస్టమర్‌ని కూడా అడుగుతావా ఇలాంటి డైలాగుల చెల్లవింక. తప్పకుండా టీకా తీసుకున్నట్లు సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. అంతేకాదు, దానికి తోడు ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాలి. అలా అయితేనే ఇక నుంచి నీలగిరి జిల్లాలో మద్యంబాబులకు బాటిల్ దొరికేది. అక్కడి వారికి పాపం పెద్ద సమస్యే వచ్చింది. అంటూ సాటి మందుబాబులు జాలి చూపిస్తున్నారు.
నీలగిరి జిల్లానే ఎందుకు అని కొందరు ప్రశ్నించగా.. ఊరికే ఆ జిల్లాను ఎంచుకోలేదంట. దానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు అధికారులు. ఒకటి ఆ జిల్లాలో ఎక్కువ మందికి టీకాలు వేయడం. మరొకటి 18 ఏళ్లు దాటిన వారు 70 శాతం మంది ఉడటం. మరి మద్యం కోసమైన టీకాలు వేయించుకుంటారేమో చాడాలి. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.